Gehlot Support pilot: ఐఏఎఫ్ త్యాగాలను అనుమానిస్తారా? బీజేపీపై సీఎం ఫైర్
ABN, First Publish Date - 2023-08-16T21:39:08+05:30
సీఎం సీటు విషయంలో పలుమార్లు తమ మధ్య విభేదాలు తలెత్తినా వాటిని పక్కనపెట్టి తన పార్టీ సహచరుడు సచిన్ పైలట్ కు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తాజాగా బాసటగా నిలిచాడు. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికల తరుణంలో ఈ ఇద్దరు ప్రముఖ నేతల మధ్య ఇలాంటి కనిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
జైపూర్: సీఎం సీటు విషయంలో పలుమార్లు తమ మధ్య విభేదాలు తలెత్తినా వాటిని పక్కనపెట్టి తన పార్టీ సహచరుడు సచిన్ పైలట్ (Sachin Pilot)కు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) తాజాగా బాసటగా నిలిచాడు. సొంత మిజోరం ప్రజలపైనే 1966లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) పైలట్‌గా ఉన్న సచిన్ పైలట్ తండ్రి దివంగత రాజేష్ పైలట్ బాంబు దాడులు చేశారంటూ బీజేపీ చేసిన విమర్శలను గెహ్లాట్ బుధవారంనాడు తిప్పికొట్టారు. ఐఏఎఫ్ త్యాగాలను బీజేపీ అవమానిస్తోందంటూ గెహ్లాట్ బుధవారంనాడు ఒక ట్వీట్‌లో నిప్పులు చెరిగారు. రాజేష్ పైలెట్ ఐఏఎఫ్‌లో అత్యంత ధైర్యసాహసాలను పైలట్ అని అభివర్ణించారు. ఈ ఏడాది రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల తరుణంలో సచిన్ పైలట్, గెహ్లాట్ మధ్య ఇలాంటి సయోధ్య చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వివాదం ఇలా సాగింది..
బీజేపీ సోషల్ మీడియా సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఇటీవల ఒక ట్వీట్‌లో రాజేష్ పైలట్, సురేష్ కల్మాడిలపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఇద్దరూ ఐఏఎఫఅ జెట్ల పైలెట్లుగా 1966 మార్చిలో మిజోరాం రాజధాని ఐజ్వాల్‌పై బాంబుల వర్షం కురిపించారని ఆరోపించారు. ఆ తర్వాత ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ టిక్కెట్లు ఇచ్చి తమ ప్రభుత్వంలో మంత్రి పదవులు ఇచ్చిందని, ఈశాన్య రాష్ట్రంలో సొంత ప్రజలపై వాయి దాడులు చేసిన వారికి ఇందిరాగాంధీ రాజకీయ రివార్డులు ఇచ్చారని తప్పుపట్టారు.
మాలవీయ వ్యాఖ్యలను రాజేష్ పైలట్ మంగళవారంనాడు తిప్పికొట్టారు. బీజేపీ సోషల్ మీడియా చీఫ్ మిజోరం సమాచారంలో తప్పుడు తేదీలు ఇచ్చారంటూ ప్రత్యారోపణలు చేశారు. ''మీరు తప్పుడు తేదీలు, తప్పుడు సమాచారం ఇచ్చారు. ఎయిర్ ఫోర్స్ పైలైట్‌గా మా తండ్రి బాంబులు విడిచిన మాట నిజం. అయితే ఆ బాంబులు వేసింది 1971లో భారత్-పాక్ యుద్ధ సమయంలోనే కానీ, మిజోరాంలో కాదు, మీరు చెప్పిన తేదీల్లో ఎంతమాత్రం కాదు'' అని అన్నారు. 1966 అక్టోబర్ 29లో మాత్రమే తన తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లోకి వచ్చారని స్పష్టత ఇచ్చారు.
ఐఏఎఫ్ త్యాగాలకు విలువ ఇదేనా?: గెహ్లాట్
కాగా, సచిన్ పైలట్ వాదనకు బలం చేకూరుస్తూ అశోక్ గెహ్లాట్ బుధవారంనాడు ఓ ట్వీట్‌లో బీజేపీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేత, దివగంత రాజేష్ పైలట్ భారత వైమానిక దళంలో అత్యంత సాహసి అయిన పైలట్ అని కొనియాడారు. ఆయనను అనుమానించడం ద్వారా ఐఏఎఫ్ త్యాగాలను బీజేపీ అవమానిస్తోందన్నారు. యావద్దేశం ఈ చర్యను ఖండిచాలని గెహ్లాట్ ఆ ట్వీట్‌లో కోరారు.
కాంగ్రెస్ హయాంలోనే మిజోరంపై దాడులన్న పీఎం
దీనికి ముందు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత వారంలో కేంద్రంలోని గత కాంగ్రెస్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈశాన్యా రాష్ట్రాల పట్ల సరైన తీరులో వ్యవహరించకపోవడమే అక్కడి తాజా పరిస్థితులకు కారణమని విమర్శించారు. ఇందిరాగాంధీ మిజోరం ప్రజలపై దాడులకు ఐఏఎఫ్‌ను ఉపయోగించేవారని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు, వరుస కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో ఈశాన్య రాష్ట్రాలు ఎప్పడూ దేశంతో మమేకం కాలేకపోయాయని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయిందని అన్నారు.
Updated Date - 2023-08-16T21:41:16+05:30 IST