Gehlot VS Pilot: పైలట్ దీక్ష బేఖాతరు... మిషన్-2030తో గెహ్లాట్..!
ABN, First Publish Date - 2023-04-11T15:52:32+05:30
రాజస్థాన్‌ను 2030 నాటికి అగ్రరాష్ట్రంగా నిలిపేందుకు ''మిషన్ 2030'' పేరుతో ఒక వీడియోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్..
జైపూర్: రాజస్థాన్‌ను 2030 నాటికి అగ్రరాష్ట్రంగా నిలిపేందుకు ''మిషన్ 2030'' (Mission 2030) పేరుతో ఒక వీడియోను ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot) విడుదల చేశారు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పటికీ గత బీజేపీ సర్కార్ అవినీతిపై అశోక్ గెహ్లాట్ సర్కార్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ (Sachin Pilot) జైపూర్‌లో ఒకరోజు నిరసన దీక్ష చేపట్టిన మంగళవారంనాడే 'విజన్-2030' వీడియోను గెహ్లాట్ ఆవిష్కరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
''2030 నాటికి రాజస్థాన్‌ను అగ్రరాష్ట్రంగా నిలపాలని నేను నిర్ణయించుకున్నాను. ఈ కలను సాకారం చేసేందుకు గత నాలుగు బడ్జెట్లు, ఈసారి 'బచత్, రహత్, బధత్' బడ్జెట్‌లోనూ ఏ రాష్ట్రంలోనూ లేనన్ని స్కీమ్‌లు తెచ్చాను'' అని ఆ వీడియోలో గెహ్లాట్ పేర్కొన్నారు. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం, సబ్సిడీతో ఎల్‌పీజీ సిలెండర్లు, రూ.10 లక్షల ప్రమాద బీమాతో సహా తమ ప్రభుత్వ తీసుకువచ్చిన అనేక పథకాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. మిషన్-2030 విజయవంతానికి చాలా కసరత్తు చేశామని తెలిపారు. ఇందులో మొదటి అడుగుగా 'బచత్, రహత్, బథత్' బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని, ఈరోజు మరో అడుగు వేస్తున్నానని చెప్పారు. ఏప్రిల్ 24 నుంచి రాష్ట్రవ్యాప్తంగా వేలాది 'ఇన్‌ఫ్లేషన్ రిలీఫ్ క్యాంపులు' నిర్వహిస్తున్నామని, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను ప్రజలు పొందగలుగుతారని చెప్పారు. ద్రవ్యోల్బణం కారణంగా రాజస్థాన్ ప్రగతిపథంలోకి వెళ్లలోకపోతోందని, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో ప్రజలకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు.
Updated Date - 2023-04-11T15:52:32+05:30 IST