Congress Vs BJP : మహాభారతంలో ‘లవ్ జీహాద్’ ఉందన్న కాంగ్రెస్ నేత.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హిమంత బిశ్వ శర్మ..
ABN, First Publish Date - 2023-07-28T11:08:08+05:30
‘లవ్ జీహాద్’ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బుజ్జగింపు రాజకీయాల కోసం పాకులాడే పార్టీలు ‘లవ్ జీహాద్’ను పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తుండగా, ఇదంతా ఓ వర్గంపై జరుగుతున్న దుష్ప్రచారమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గువాహటి : ‘లవ్ జీహాద్’ గురించి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. బుజ్జగింపు రాజకీయాల కోసం పాకులాడే పార్టీలు ‘లవ్ జీహాద్’ను పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపిస్తుండగా, ఇదంతా ఓ వర్గంపై జరుగుతున్న దుష్ప్రచారమని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్సాం కాంగ్రెస్ చీఫ్ భూపేన్ బోరాహ్ మాట్లాడుతూ, మహాభారతంలో ‘లవ్ జీహాద్’ జరిగిందని ఆరోపించారు. దీనిపై అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ఘాటుగా స్పందించారు. సనాతన ధర్మం, హిందూ ధర్మాలకు వ్యతిరేకంగా బోరాహ్ మాట్లాడారని దుయ్యబట్టారు.
భూపేన్ బోరాహ్ మీడియాతో మాట్లాడుతూ, రుక్మిణి దేవిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవాలని కోరుకున్నపుడు, అర్జునుడు ఓ యువతి రూపంలో వచ్చినపుడు లవ్ జీహాద్ జరిగిందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలను హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా ఖండించారు. భూపేన్ బోరాహ్ వ్యాఖ్యలు సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి విరుద్ధమని తెలిపారు. శ్రీకృష్ణుడు, రుక్మిణి దేవిల అంశాన్ని లేవనెత్తడం ఖండించదగినదని చెప్పారు. ఇది సనాతన ధర్మానికి విరుద్ధమని చెప్పారు. హజ్రత్ మహమ్మద్‌ను, జీసస్ క్రైస్ట్‌ను ఏ విధంగా అయితే వివాదాల్లోకి లాగబోమో, అదేవిధంగా శ్రీకృష్ణుడిని వివాదాల్లోకి లాగడం మానుకోవాలని చెప్పారు. నేరపూరిత చర్యలను భగవంతుడి చర్యలతో పోల్చడం ఆమోదయోగ్యం కాదన్నారు.
ఎవరైనా కేసు పెడితే, ఈ వ్యాఖ్యలు చేసినవారిని అరెస్టు చేయవలసి ఉంటుందని, వేలాది మంది సనాతన మతస్థులు ఫిర్యాదులు చేస్తే, తాను ఆయనను కాపాడలేనని చెప్పారు. రుక్మిణి దేవిని మతం మార్చుకోవాలని శ్రీకృష్ణుడు ఎన్నడూ నిర్బంధించలేదన్నారు. తప్పుడు వివరాలు చెప్పి, ఓ యువతిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఆమెను మతం మారాలని నిర్బంధించడమే లవ్ జీహాద్ అని చెప్పారు. హిందువులు హిందువులను, ముస్లింలు ముస్లింలను పెళ్లి చేసుకుంటే, సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. ‘‘నేను నిరంతరం హిందూ దేవుళ్లను, దేవతలను పూజిస్తాను, నమాజు చేయాలని అకస్మాత్తుగా నన్ను అడిగితే, నాకు ఎలా ఉంటుంది?’’ అని ప్రశ్నించారు. మతాంతర వివాహాలు చేసుకున్నప్పటికీ, మతం మారాలని నిర్బంధించరాదని చెప్పారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం మతాంతర వివాహాలు జరగాలన్నారు. ఈ చట్టాలను అనుసరించకుండా, లక్ష్మణ రేఖను దాటితే, అదే లవ్ జీహాద్ అవుతుందన్నారు.
దాక్కొనడానికి చోటు ఉండని రోజు కాంగ్రెస్‌కు వస్తుందని, అప్పుడు మసీదు, మదరసాలలో తప్ప మరొక చోటు ఆ పార్టీకి ఉండదని అన్నారు. అక్కడ కూడా ఆ పార్టీని ఏఐయూడీఎఫ్ వెంటతరుముతుందన్నారు. ఇక ఆ పార్టీకి ఎక్కడా చోటు ఉండదన్నారు.
ఇవి కూడా చదవండి :
Congress Vs BJP : ‘రెడ్ డైరీ’లో కాంగ్రెస్ చీకటి రహస్యాలు : మోదీ
Manipur : మణిపూర్ వీడియో లీకేజ్ వెనుక కుట్ర : అమిత్ షా
Updated Date - 2023-07-28T11:08:08+05:30 IST