Bangalore: మరో పథకం వచ్చేస్తోంది.. 5న గృహజ్యోతికి శ్రీకారం
ABN, First Publish Date - 2023-08-02T11:48:32+05:30
రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ పథకాల్లో ఒకటైన గృహజ్యోతిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) కలబురగిలోని ఎన్‌బీ మైదా
- కలబురగిలో ప్రారంభించనున్న సీఎం
- విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ వెల్లడి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీ పథకాల్లో ఒకటైన గృహజ్యోతిని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) కలబురగిలోని ఎన్‌బీ మైదానంలో ఈనెల 5న లాంఛనంగా ప్రారంభించనున్నారు. బెంగళూరు(Bangalore)లో మంగళవారం విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్(Minister KJ George) మీడియాతో మాట్లాడుతూ బెస్కాం పరిధిలో ఉచిత విద్యుత్ బిల్లుల పంపిణీ ప్రారంభమైందన్నారు. ఆగస్టు నెల నుంచే ఈ పథకం అమలులోకి వచ్చిందని, మొత్తం 1.42 కోట్ల కుటుంబాలకు దీని ద్వారా ప్రయోజనం దక్కనుందన్నారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఐటీ బీటీ శాఖల మంత్రి ప్రియాంకఖర్గేతోపాటు పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని చెప్పారు. మధ్య తరగతి కుటుంబాలకు ఈ పథకం వరప్రసాదం కానుందన్నారు. 200 యూనిట్ల వాడకం వరకు ఉచిత విద్యుత్ సరఫరా ఉంటుందన్నారు. జూలై 27కు ముందు గృహజ్యోతి కోసం దరఖాస్తు చేసుకున్నవారందరికీ ప్రస్తుత నెలలోనే బిల్లులో రాయితీ లభిస్తుందన్నారు. జూలై 27 తర్వాత దరఖాస్తు చేసుకున్నవారికి సెప్టెంబరులో ప్రయోజనం లభిస్తుందన్నారు. గృహజ్యోతి, భాగ్యజ్యోతి, కుటీర జ్యోతి, అమృతజ్యోతి పథకాలన్నింటినీ ఒకే గొడుగుకిందకు తీసుకొచ్చామని మొత్తం 2.14 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనుందన్నారు. 200 యూనిట్లకుపైగా విద్యుత్ వినియోగించినవారు పూర్తి బిల్లు మొత్తం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఈ పథకంపై సందేహాలు ఉన్నవారు, దరఖాస్తు చేసుకోదలిచినవారు బెస్కాం సహా అన్ని విద్యుత్ కార్యాలయాలను సందర్శించవచ్చునన్నారు. ఉచిత విద్యుత్ పథకం ద్వారా ప్రభుత్వంపై పడే భారాన్ని దుబారా ఖర్చులు తగ్గించుకోవడం ద్వారా సర్దుబాటు చేస్తామని ఆయన మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు. మీడియా సమావేశంలో విద్యుత్‌శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి గౌరవ్ గుప్త, కేపీటీసీఎల్ ఇన్‌చార్జ్ ఎండీ పంజక్‌కుమార్ పాండే, బెస్కాం ఎండీ మహంతేశ్ బీళగి తదితరులు పాల్గొన్నారు.
నూతన విద్యుత్ విధానానికి రూపకల్పన
విద్యుత్ ఉత్పాదనా ఖర్చును గణనీయంగా తగ్గించి వినియోగదారులకు తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చేలా నూతన పాలసీకి రూపకల్పన చేస్తున్నామని విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్(Minister KJ George) ప్రకటించారు. నగరంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంప్రదాయేతర ఇంధన వనరుల ఉత్పత్తిని పెంచడం ద్వారా ఇది సాధ్యమేనని నిపుణుల నివేదికలు తెలియజేస్తున్నాయన్నారు. సౌర విద్యుత్, పవన విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా విద్యుత్ ఉత్పాదనను పెంచేందుకు రాష్ట్రంలో గణనీయమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇందుకు ప్రత్యేక మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాల్సిందిగా అధికారులకు సూచించామని తెలిపారు. సౌర విద్యుత్‌కు భూములు లీజుకు ఇచ్చేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారన్నారు. ఇలాంటివారిని ప్రభుత్వం అన్నివిధాలా ప్రోత్సహిస్తుందన్నారు.
Updated Date - 2023-08-02T11:48:32+05:30 IST