Bihar : సీఎం నితీశ్ కుమార్ సభలో భద్రతా లోపం.. యువకుడిని అడ్డుకున్న సిబ్బంది..
ABN, First Publish Date - 2023-08-15T14:12:47+05:30
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు.
పాట్నా : బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా నిర్వహించిన సభలో ఓ యువకుడు హల్‌చల్ చేశాడు. భద్రతా వలయాన్ని దాటుకుని నితీశ్ వైపునకు పరుగులు తీయబోయాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆ యువకుడిని అక్కడికక్కడే అడ్డుకోగలిగారు. ఆ యువకుడి పేరు కూడా నితీశ్ కుమార్ కావడం విశేషం.
స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాట్నాలోని గాంధీ మైదానంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోకి నితీశ్ కుమార్ అనే 26 ఏళ్ల యువకుడు పరుగు పరుగున దూసుకొచ్చాడు. ఆయన చేతిలో ఓ పోస్టర్ ఉంది. తన తండ్రి బిహార్ మిలిటరీ పోలీస్ ఉద్యోగి అని, ఆయన ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగానే మరణించారని, తనకు కారుణ్య ప్రాతిపదికపై ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని ఆ పోస్టర్లో రాశారు.
జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సమయంలో యువకుడు నితీశ్ కుమార్ సీఎం వద్దకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది తక్షణమే స్పందించి, ఆ యువకుడిని అడ్డుకుని, అక్కడి నుంచి పంపించేశారు.
ఈ సంఘటనపై అత్యున్నత స్థాయి దర్యాప్తునకు పాట్నా జిల్లా యంత్రాంగం ఆదేశించింది. పాట్నా జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సింగ్ మాట్లాడుతూ, సీఎం సభలోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన యువకుడి పేరు నితీశ్ కుమార్ అని గుర్తించినట్లు తెలిపారు. ఆయన తండ్రి పేరు రాజేశ్వర్ పాశ్వాన్ అని తెలిపారు. ముంగేర్ జిల్లాకు చెందిన రాజేశ్ బిహార్ మిలిటరీ పోలీస్ ఉద్యోగి అని, ఆయన ఐదేళ్ల క్రితం విధి నిర్వహణలో ఉండగా మరణించారని తెలిపారు. తన తండ్రి విధి నిర్వహణలో మరణించినందువల్ల తనకు ప్రభుత్వోద్యోగం పొందే అర్హత ఉందని నితీశ్ కుమార్ (26) చెప్తున్నారని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రి నితీశ్‌ను కలవాలని వచ్చినట్లు తెలిపారని చెప్పారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి :
Independence Day : మణిపూర్ రాష్ట్రానికి అండగా యావద్భారతావని : మోదీ
Independence Day : మధ్య తరగతి, మహిళల నేతృత్వంలో అభివృద్ధి : మోదీ
Updated Date - 2023-08-15T14:12:47+05:30 IST