Bilkis Bano Case: డాక్యుమెంట్లు సిద్ధం చేయండి.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసు
ABN, First Publish Date - 2023-03-27T19:44:39+05:30
గుజరాత్ అల్లర్లు-2002లో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో దోషులుగా యావజ్జీవ శిక్ష పడిన..
న్యూఢిల్లీ: గుజరాత్ అల్లర్లు-2002లో బిల్కిస్ బానో (Bilkis Bano)పై సామూహిక అత్యాచారం జరిపిన కేసులో దోషులుగా యావజ్జీవ శిక్ష పడిన 11 మందిని ముందస్తుగా విడుదల చేయడంపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారంనాడు విచారణ జరిపింది. శిక్ష తగ్గించి దోషుల విడుదల చేయాలని గుజరాత్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఆ రాష్ట్రానికి, కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 18న కేసును మరోసారి విచారిస్తామని, ఆ తేదీ నాటికి పూర్తి వివరాలతో డాక్యుమెంట్లు సమర్పించాలని జస్టిస్ కేఎం జోసఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కడీన ధర్మాసనం స్పష్టం చేసింది.
ఇది చాలా 'భయంకరమైన' నేరమని ధర్మాసనం పేర్కొంది. పలువురు రాజకీయ, పౌరహక్కుల కార్యకర్తలతో పాటు బిల్కిస్ బానో ఒక రిట్ పిటిషన్ వేశారు.
తమ ముందు ఎన్నో హత్యా కేసులు విచారణకు వచ్చాయనీ, ఆయా కేసుల్లో దోషులు ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవిస్తూనే ఉన్నారనీ, ఈ కేసులోనూ అదే నిబంధన పాటించాల్సిన అవసరం లేదా? అని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రశ్నించింది. ఇది భావోద్వేగాలకు సంబంధించిన కేసు కాదని, చట్ట ప్రకారం వ్యవహరించడం జరుగుతుందని స్పష్టం చేసింది.
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం కేసులో దోషులుగా యావజ్జీవ జైలుశిక్ష పడిన 11 మందిని సత్ప్రవర్తన పేరుతో గత ఏడాది ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి నుంచి బిల్కిస్ బానోతో పాటు పలు వర్గాల నుంచి ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా కూడా పిటిషన్ వేశారు. గుజరాత్ ప్రభుత్వం మాత్రం తమ నిర్ణయాన్ని సమర్ధించుకుంది. రెమిషన్ పాలసీ ఆధారంగా తీసుకున్న నిర్ణయం సరైందేనని చెప్పింది. ఈ నిర్ణయాన్ని బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో సవాలు చేయగా, దీనిపై సత్వర విచారణ జరపాలని సీజేఐ ఈనెల 22న ఆదేశిస్తూ, పిటిషన్లన్నింటినీ విచారించేందుకు కొత్త బెంచ్ ఏర్పాటుకు అంగీకరించారు.
Updated Date - 2023-03-27T19:44:39+05:30 IST