Jyotiraditya Scindia: వేదికపై సింధియా ప్రవర్తనపై... వీడియా వైరల్
ABN, First Publish Date - 2023-03-12T14:39:19+05:30
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ప్రసంగించకుండా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్‌లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ప్రసంగించకుండా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia) అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బీజేపీ సంప్రదాయం ఇదంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పించగా, ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింంది.
మాధవ్ నేషనల్ పార్క్‌కు టైగర్ల తరలింపునకు సంబంధించి శివపురి జిల్లాలో బీజేపీ ఒక కార్యక్రమం నిర్వహించింది. తన పేరు రాగానే రాష్ట్ర బీజేపీ చీఫ్ శర్మ ప్రసంగించేందుకు మైకు వద్దకు వెళ్లారు. వేదికపైనే ఉన్న సింధియా వెంటనే ఆయన దగ్గరకు వెళ్లి క్లుప్లంగా మాట్లాడి ఆయనను వెనక్కి పంపిచేశారు. శర్మ తిరిగి తన సీటులో కూర్చున్న వెంటనే సింధియా తన ప్రసంగం మొదలుపెట్టారు. ఈ సమయంలో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా వేదకపైనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో సింధియాపై కాంగ్రెస్ మీడియా సెల్ చీఫ్ కేకే మిశ్రా విమర్శలు గుప్పించారు. ఇతర నేతలను వెనక్కినెట్టి, ముందుకు వెళ్లడం ఆయన (సింధియా) కుటుంబ సంప్రదాయమని ఎద్దేవా చేసింది.
బీజేపీ వివరణ..
కాగా, కాంగ్రెస్ విమర్శలపై బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్‌చార్జి లోకేంద్ర పరాశర్ వివరణ ఇచ్చారు. ఈవెంట్ చివర్లో పార్టీ అధ్యక్షుడు ప్రసంగించడం సంప్రదాయమని చెప్పారు. బీజేపీలో పార్టీ అధ్యక్షుడికి అత్యున్నత గౌరవం ఇస్తారని, చివర్లోనే ఆయన ప్రసంగం ఉంటుందని, కాంగ్రెస్‌కు ఇది అర్ధం కాదని అన్నారు. పార్టీ అధ్యక్షుడికి గౌరవ సూచకంగానే ఆయన ప్రసంగం విషయంలో సింధియా జోక్యం చేసుకున్నట్టు చెప్పారు.
Updated Date - 2023-03-12T15:28:04+05:30 IST