Karnataka Assembly Elections: ఎన్నికల వేళ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ బీజేపీ నేతలు
ABN, First Publish Date - 2023-04-19T16:22:33+05:30
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ హుబ్బళిలో దారుణ హత్య జరిగింది.
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ హుబ్బళిలో దారుణ హత్య జరిగింది. బీజేపీ యువమోర్చా నేత ప్రవీణ్ కుమార్‌ను(BJP Yuva Morcha leader Praveen Kammar) రాజకీయ ప్రత్యర్థులు కత్తులతో పొడిచి చంపారు. వాస్తవానికి తన వర్గీయులకు, ప్రత్యర్థులకు మధ్య ఘర్షణ జరుగుతుండగా ఆపేందుకు ప్రవీణ్ వెళ్లారు. ఇంతలోనే ప్రత్యర్థులు ఆయన్ను కత్తులతో పొడిచి చంపారు. ఘటనకు సంబంధించి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని హుబ్బళి పోలీసులు తెలిపారు. ధార్వాడ్ జిల్లా కొతూర్ గ్రామంలో ఈ ఘటన జరిగిందని కర్ణాటక శాంతి భద్రతల ఏడీజీపీ అలోక్ కుమార్ (Alok Kumar, ADGP, Law & Order, Karnataka) తెలిపారు. రాత్రి ఒంటిగంట సమయంలో ప్రవీణ్‌ను ప్రత్యర్థులు పొడిచారని, ఆ తర్వాత ఆయన్ను ఎస్‌డీఎం ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే ఉదయం 5 గంటలకు ప్రవీణ్ తుదిశ్వాస విడిచాడని తెలిపారు. ఘటనకు సంబంధించి నలుగురిని అరెస్ట్ చేశామన్నారు.
కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఎన్నికల వేళ జరిగిన ఈ హత్యతో పోలీస్ యంత్రాంగంతో పాటు రాజకీయ పార్టీల నేతలు ఉలిక్కిపడ్డారు. ఎన్నికల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Updated Date - 2023-04-19T16:40:28+05:30 IST