Britain : భారత్ ఎదుగుదలపై బ్రిటన్ దౌత్యవేత్త వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-27T10:45:55+05:30
భారత దేశం క్రమంగా ఎదుగుతున్న తీరును విదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కోవిడ్-19కు టీకాను సొంతంగా అభివృద్ధి చేసి, 130 కోట్ల మంది భారతీయులకు టీకాకరణ చేయడంలో విజయవంతమవడం దగ్గర నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టడం వరకు అన్నిటినీ పరిశీలిస్తున్నాయి.
న్యూఢిల్లీ : భారత దేశం క్రమంగా ఎదుగుతున్న తీరును విదేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. కోవిడ్-19కు టీకాను సొంతంగా అభివృద్ధి చేసి, 130 కోట్ల మంది భారతీయులకు టీకాకరణ చేయడంలో విజయవంతమవడం దగ్గర నుంచి చంద్రయాన్-3 చంద్రునిపై అడుగు పెట్టడం వరకు అన్నిటినీ పరిశీలిస్తున్నాయి. న్యూఢిల్లీలోని బ్రిటన్ దౌత్యవేత్త అలెక్స్ ఎల్లిస్ (Alex Ellis) చేసిన వ్యాఖ్యలను దీనికి తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
అలెక్స్ ఎల్లిస్ ఎన్డీటీవీ జీ20 కాంక్లేవ్‌లో శనివారం మాట్లాడుతూ, భారత దేశం ఎదుగుదలను, అంతర్జాతీయ స్థాయిలో దాని హోదాను రెండు చిన్న కొలబద్దలతో కొలవవచ్చునని చెప్పారు. G20 ప్రెసిడెన్సీని ఏ విధంగా నిర్వహించాలనే విషయంలో భారత దేశం గొప్ప దృష్టాంతాన్ని సృష్టించిందని, మరోవైపు ఆగస్టు 15న బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ (Rishi Sunak) ‘‘జై శ్రీరామ్’’ అంటూ నినాదం చేశారని, ఈ రెండూ భారత దేశ హోదా, ఎదిగిన తీరుకు కొలబద్దలని చెప్పారు.
‘‘విద్యార్థులు, సందర్శకులు, నైపుణ్యంగల కార్మికులు... బ్రిటన్‌లోని ఈ మూడు వీసా విభాగాల్లోనూ భారత దేశానిదే అగ్ర స్థానం. 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ఉన్న వ్యక్తి ఆగస్టు 15న జైశ్రీరామ్ అని అంటారని మీరు ఎప్పుడైనా ఊహించారా? లార్డ్ కర్జన్ ఉక్కిరిబిక్కిరై ఉండేవారు’’ అని ఎల్లిస్ చెప్పారు.
ప్రపంచ సమస్యల పరిష్కారానికి భారత దేశ కృషి, ఆకాంక్షలు చాలా ఎక్కువ అని తెలిపారు. జీ20 ప్రెసిడెన్సీని నిర్వహించడం విషయంలో మూస పద్ధతికి భారత్ తిలోదకాలిచ్చిందన్నారు. ప్రపంచాన్ని వేధిస్తున్న ఆకలి, తక్కువ అభివృద్ధి, పేదరికం వంటి ప్రపంచ సమస్యలను పరిష్కరించడం కోసం భారత దేశానికి చాలా గొప్ప ఆకాంక్షలు ఉన్నట్లు తెలిపారు. భారత దేశం పట్ల ఆసక్తి సుదీర్ఘ కాలానికి సంబంధించినదని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి వల్ల మనం ఎలాంటి ప్రపంచంలో ఉన్నామో అర్థమవుతుందన్నారు. ప్రపంచంలో అత్యంత ప్రధాన దేశంగా భారత దేశం నిలుస్తుందన్నారు. రష్యాతో అనుసరించవలసిన విధానాన్ని మనం కనుగొనాలన్నారు.
లార్డ్ కర్జన్ ఎవరు?
భారత దేశ వైస్‌రాయ్ లార్డ్ కర్జన్ 1905లో బెంగాల్ విభజనకు కారకుడు. ఆయన విభజించు-పాలించు విధానాన్ని అనుసరించాడు. మతపరమైన, ప్రాంతీయ విద్వేషాలను సృష్టించాడు.
రిషి సునాక్ ‘జై సియా రామ్’ నినాదం
భారతీయ మూలాలుగల రిషి సునాక్ ఆగస్టు 15న బ్రిటన్‌లోని ఓ విశ్వవిద్యాలయంలో రామ కథకు హాజరయ్యారు. ప్రముఖ ప్రవచనకర్త మురారి బాపు రామ కథను ప్రవచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రిషి సునాక్ తాను ప్రధాన మంత్రి హోదాలో ఇక్కడికి రాలేదని, ఓ హిందువుగా వచ్చానని చెప్పారు. ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించే ముందు ‘‘జై సియా రామ్’’ అని భక్తిశ్రద్ధలతో నినాదం చేశారు. భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాలు జరిగే రోజున మురారి బాపు వినిపిస్తున్న రామ కథను వినడానికి రావడం తనకు లభించిన గొప్ప గౌరవమని తెలిపారు.
ఇవి కూడా చదవండి :
2024 Lok Sabha elections : మా ప్రధాన మంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ : అశోక్ గెహ్లాట్
Ilayaraja, DSP: ఇళయరాజా ఆశీస్సులు అందుకున్న దేవిశ్రీప్రసాద్
Updated Date - 2023-08-27T10:45:55+05:30 IST