Britain : టిక్‌టాక్‌కు మరో భారీ షాక్
ABN, First Publish Date - 2023-03-17T13:44:57+05:30
వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ (TikTok) యూజర్ల డేటా దుర్వినియోగమవుతుందనే ఆందోళన సర్వత్రా పెరుగుతోంది.
న్యూఢిల్లీ : వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ (TikTok) యూజర్ల డేటా దుర్వినియోగమవుతుందనే ఆందోళన సర్వత్రా పెరుగుతోంది. ఈ డేటాను చైనా ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని, తద్వారా తమ జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుందని చాలా దేశాలు భావిస్తున్నాయి. ఈ జాబితాలో తాజాగా బ్రిటన్ కూడా చేరింది.
బైట్‌డ్యాన్స్ (ByteDance) కంపెనీకి చెందిన టిక్‌టాక్ వీడియో షేరింగ్ యాప్‌పై పాశ్చాత్య దేశాలు, యూరోపియన్ యూనియన్, అమెరికా ఇప్పటికే కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ కేబినెట్ ఆఫీస్ మినిస్టర్ ఓలివెర్ డౌడెన్ గురువారం పార్లమెంటులో మాట్లాడుతూ, భద్రతపరమైన కారణాలతో టిక్‌టాక్ యాప్‌ను బ్రిటన్ ప్రభుత్వ ఫోన్లలో నిషేధించినట్లు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని చెప్పారు. బ్రిటన్ చట్టసభల సభ్యులు ఈ యాప్‌ను తమ ఫోన్లలో ఉపయోగించకూడదని తెలిపారు. ప్రభుత్వ సమాచారాన్ని ఈ యాప్ ఉపయోగించుకునే తీరు ప్రమాదకరం కావచ్చునన్నారు. సున్నితమైన ప్రభుత్వ సమాచార భద్రతకు పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపారు. సైబర్ సెక్యూరిటీ నిపుణుల సలహా మేరకు ప్రభుత్వ డివైస్‌లలో ఈ యాప్‌ను నిషేధిస్తున్నట్లు తెలిపారు.
అయితే యూజర్ల డేటాను చైనా ప్రభుత్వానికి తాము ఇస్తున్నామన్న ఆరోపణలను టిక్‌టాక్ యాజమాన్యం తోసిపుచ్చింది. మన దేశం ఈ యాప్‌ను ఇప్పటికే పూర్తిగా నిషేధించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
weddings: భర్తలతో పాటు భార్యలకు కూడా తప్పడం లేదు..
Karnataka : బంగ్లాదేశీయుల రాకతో మన సంస్కృతికి ముప్పు : హిమంత బిశ్వ శర్మ
Updated Date - 2023-03-17T13:44:57+05:30 IST