Budget Session: రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి.. దద్దరిల్లిన పార్లమెంటు
ABN, First Publish Date - 2023-03-13T14:02:15+05:30
భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ గతవారం లండన్‌లో చేసిన..
న్యూఢిల్లీ: భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతోందంటూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గతవారం లండన్‌లో చేసిన వ్యాఖ్యలు పార్లమెంటు ఉభయసభల్లోనూ దుమారం రేపాయి. రాహుల్ క్షమాపణ చెప్పాలంటూ ఇటు లోక్‌సభలోనూ, అటు రాజ్యసభలోనూ అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేశారు. విపక్ష కాంగ్రెస్ పార్టీ సభ్యులు వ్యతిరేకించడంతో ఉభయ సభల్లోనూ గందరగోళ వాతావరణం నెలకొని మధ్యాహ్నం వరకూ సభా కార్యక్రమాలు వాయిదా పడ్డాయి.
బడ్జెట్ రెండో విడత సమావేశాలు సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభంకాగానే కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath singh) లోక్‌సభలో రాహుల్ ప్రస్తావన చేశారు. "లోక్‌సభ సభ్యుడైన రాహుల్ గాంధీ లండన్‌లో ఇండియాను అవమానించారు. సభాసభ్యులందరూ అతని ప్రకటనను ఖండించాలి. సభకు ఆయన క్షమాపణ చెప్పాలి'' అని అన్నారు. దేశ అంతర్గత వ్యవహారాలపై విదేశీ జోక్యాన్ని రాహుల్ కోరారని ఆరోపించారు. దీనిని సభ్యులంతా ఖండించాలని అన్నారు. రాజ్‌నాథ్‌కు బీజేపీ మిత్రపక్ష నేతలు మద్దతు పలుకగా, కాంగ్రెస్ సభ్యులు వ్యతిరేకించారు. మోదీ విదేశాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిచారని ఆందోళన వ్యక్తం చేపట్టారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ..
ఇటు.. రాజ్యసభలోనూ ఇదే అంశంపై గందరగోళం చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈ అంశాన్ని సభలో లెవనెత్తుతూ, భారత ప్రజాస్వామ్యంపై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో ప్రజాసామ్యం ఏమైంది? చట్టాల ప్రతులను చించేసినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైంది? అప్పుడు ప్రజాస్వామ్యం పోయిందే కానీ, ఇప్పుడు కాదంటూ ఆయన వ్యాఖ్యానించారు. గోయల్ వ్యాఖ్యలను రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే ఖండించారు. సభలో సభ్యుడు కాని వ్యక్తిని పిలిచి క్షమాపణ చెప్పాలని అడగడం ఏమిటని నిలదీశారు. సభలో గందరగోళం నెలకొనడంతో సభ మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా పడింది.
Updated Date - 2023-03-13T14:02:15+05:30 IST