By-election: ఉప‘పోరు’లో ఊపందుకున్న ప్రచారం
ABN, First Publish Date - 2023-02-09T09:05:31+05:30
ఈరోడ్ తూర్పు(Erode East) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది.. నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారంతో ముగియడంతో
- దూసుకుపోతున్న డీఎంకే కూటమి
- ఎన్నికల హామీలు, పన్ను పెంపు నినాదాలుగా ప్రతిపక్షాలు
పెరంబూర్(చెన్నై), ఫిబ్రవరి 8: ఈరోడ్ తూర్పు(Erode East) అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది.. నామినేషన్ల స్వీకరణ ఘట్టం మంగళవారంతో ముగియడంతో అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నాడీఎంకే కూటమి ప్రచారంలో వేగం పెంచాయి. ఇప్పటికే డీఎంకే(DMK) కూటమి ప్రచారంలో దూసుకెళ్తుండగా, ఎన్నికల హామీల అమలులో విఫలం, ఆస్తి పన్ను, ఆవిన్ పాలు, విద్యుత్ ఛార్జీల పెంపు, పాలనతో అవినీతి తదితరాలు నినాదంగా ప్రతిపక్ష అన్నాడీఎంకే ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
12 మంది మంత్రుల మకాం...
కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా మృతితో జరుగనున్న ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన వెంటనే సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రె్‌సకే కేటాయిస్తున్నట్లు డీఎంకే ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని కూటమి పార్టీలైన సీపీఎం, సీపీఐ, డీపీఐ, ఎండీఎంకే తదితర పార్టీలు స్వాగతించాయి. కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటించక ముందే ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదేశాలతో 12 మంది మంత్రులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ముందుగా స్థానికనేత మంత్రి ముత్తుస్వామి నేతృత్వంలో ప్రచారానికి శ్రీకారం చుట్టగా, మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎంఏ వేలు, ఎం.సుబ్రమణ్యం, తంగం తెన్నరసు, అన్బిల్ మహేష్, సహా 12 మంది మంత్రులు తమకు కేటాయించిన వార్డుల్లో ప్రచారం చేపట్టారు. ఇక, ఎన్నికల ఖర్చు, కూటమి పార్టీ నేతలల ప్రచారం, ప్రచారం తదితరాలు మంత్రి వేలు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్‌తో కలసి రెండో విడత ప్రచారం కూడా పూర్తిచేశారు. కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌హాసన్ కూడా సీఎం స్టాలిన్‌తో కలసి ప్రచారసభలో పాల్గొంటారని సమాచారం.
అన్నాడీఎంకే ‘స్కాన్ రిపోర్ట్’...
అన్నాడీఎంకేలో అభ్యర్థి ఎంపికలో తలెత్తిన గందరగోళంతో ప్రచారం వెనుకబడింది. ప్రస్తుతం ఆ పార్టీ అభ్యర్థిగా కేఎస్ తెన్నరసు మంగళవారం చివరి రోజు నామినేషన్ వేసి ప్రచారం ప్రారంభించారు. ముందుగా మాజీ మంత్రి సెంగోట్టయన్ నేతృత్వంలో బూత్‌స్థాయి నిర్వాహకులు సమావేశం నిర్వహించారు. సమావేశంలో మృతి చెందిన వారు, కొత్త ఓటర్లు, మహిళలు, యువకులు ఓటరు జాబితా ‘స్కాన్’ చేసి ఆయా వార్డుల్లో కేటాయించిన మాజీ మంత్రులకు అప్పగించారు. అలాగే, వందమందికి ఒక బూత్ కమిటీ సభ్యుడిని కేటాయించి, వారితో ప్రతిరోజు సంప్రదించాలని నిర్ణయించారు. గత ఎన్నికల్లో పోటీచేసిన తమిళ మానిల కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు ఎం.యువరాజన్ పాత్ర ఎన్నికల ప్రచారంలో ప్రధానం. ఇక, మాజీ మంత్రులు వేలుమణి, తంగమణి, విజయభాస్కర్, కరుప్పన్, కేపీ మునుస్వామి తదితరులు వార్డుల్లో మకాం వేసి ప్రచారం చేపట్టారు. అదే సమయంలో తన కుమార్తె వివాహం ఈ నెల 23న మదురైలో జరుగనున్న నేపథ్యంలో, మాజీ మంత్రి ఉదయ్‌కుమార్ వివాహ పనులను ఇతరుకు అప్పగించి ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్నాడీఎంకే అభ్యర్థికి మద్దతుగా కూటమి పార్టీలు టీఎంసీ అఽధ్యక్షుడు జీకే వాసన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సహా సీనియర్ నేతలు కూడా ప్రచారంలో పాల్గొంటుండగా, పలువుకు కేంద్ర మంత్రులతో కూడా ప్రచారం చేయించాలని అన్నాడీఎంకే అధిష్ఠానం భావిస్తోంది. అలాగే, ఆ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి నియోజకవర్గం మొత్తం సుడిగాలి ప్రచారం చేపట్టనున్నారు. ఇక, ‘రెండాకుల చిహ్నం’ కోసం తమ అభ్యర్థిని ఉపసంహరించుకున్న ఒ.పన్నీర్‌సెల్వం ప్రచారంలో పాల్గొంటారా, లేదా అనే సందిగ్దం నెలకొంది. ఇక, దుకాణాల్లో టీ పెట్టడం, దోశెలు వేయడం, మార్కెట్లలో కూరగాయలు అమ్ముతూ నేతలు ప్రచారం చేపడుతున్నారు.
సాయంత్రం 6 గంటలకు ఇళ్లకు తాళాలు....!
డీఎంకే ప్రచార వ్యూహంలో సరికొత్త పంథాకు నాంది పలికింది. ఈరోడ్ వీరప్పన్‌సత్రం ప్రాంతంలో ప్రచార బాధ్యతలు చేపట్టిన నాయకుడు ఆ ప్రాంతంలో ఉన్న పురుషులు, మహిళా ఓటర్లను సాయంత్రం 6 నుంచి పిలుపించుకొని రాత్రి 9 గంటలకు ఇళ్లకు పంపిస్తున్నారు. ఇతర పార్టీల నాయకులు ప్రచారానికి వెళ్లిన సమయంలో ఆ ఇళ్లకు తాళాలు వేసి ఉండడం చూసి ఖంగుతింటున్నారు. ఇక, ఓటర్లు బసచేసిన ప్రదేశంలో వివిధ వినోధ కార్యక్రమాలు, విందు ఏర్పాటుచేస్తున్నారు. అలాగే, అభ్యర్థులు, మంత్రులు ప్రచారానికి వచ్చే సమయంలో మహిళలు వారికి రోడ్డు కిరువైపులా నిలబడి హారతులిస్తున్నారు. ఇక, ఈ ఎన్నికలో పోటీచేస్తున్న నామ్ తమిళర్ కట్చి, డీఎండీకే అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు కూడా ప్రచారం తీవ్రతరం చేశారు.
24న సీఎం స్టాలిన్ ప్రచారం
ప్యారీస్: డీఎంకే కూటమి తరఫున పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఈవీకేఎస్ ఇళంగోవన్‌కు మద్దతుగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఈ నెల 24న ప్రచారం చేయనున్నారు. ఈ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా మృతిచెందిన కారణంగా ఈనెల 27న ఉప ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. మొత్తం 62 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలుచేశారు. ఇదిలా ఉండగా, ఈవీకేఎస్‌కు మద్దతుగా 19న మంత్రి ఉదయనిధి స్టాలిన్, 24న సీఎం స్టాలిన్‌లు ‘హస్తం’ గుర్తుపై ప్రచారం చేయనున్నట్లు అన్నా అరివాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇదికూడా చదవండి: ప్రముఖ సినీనటిపై మనీలాండరింగ్ కేసు
Updated Date - 2023-02-09T09:05:33+05:30 IST