CBI Raids: ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో సోదాలు
ABN, First Publish Date - 2023-01-14T19:30:14+05:30
ఎక్సైజ్ పాలసీ అవకతవకలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కార్యాలయంలో సీబీఐ శనివారంనాడు సోదాలు.. చేపట్టినట్టు
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy) అవకతవకలకు సంబంధించిన కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా (Manish Sisodia) కార్యాలయంలో సీబీఐ (CBI) శనివారంనాడు సోదాలు చేపట్టినట్టు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీనిపై సిసోడియా ట్వీట్ చేస్తూ, సీబీఐ గత రెయిడ్స్‌లోనూ ఏమీ దొరకలేదని, తాను తప్పు చేయనందున ఈసారి కూడా అదే జరుగుతుందని చెప్పారు.
''సీబీఐ తిరిగి ఇవాళ నా కార్యాలయానికి చేరుకుంది. వారిని స్వాగతిస్తున్నాం. వాళ్లు అప్పట్లో నా ఇంట్లో సోదాలు చేశారు, లాకర్‌లో వెదికారు, నా గ్రామానికి వెళ్లి నా గురించి వాకబు చేశారు. సోదాల్లో ఏమీ దొరకలేదు. కొత్తగా కనుగొన్నది కూడా ఏమీ లేదు. నేను ఎలాంటి తప్పూ చేయలేదు. ఢిల్లీ పిల్లల విద్య కోసం నిజాయితీగా పనిచేశాను'' అని సిసోడియా ట్వీట్ చేశారు. ఎక్సైజ్ స్కామ్‌పై గత ఏడాది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సిఫారసు చేయడంతో సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. సిసోడియాతో సహా పలువురిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. సిసోడియా అధికారిక నివాసంపై దాడులు జరపడానికి ముందు కూడా సిసోడియాను ఈ కేసుపై కొన్ని గంటల సేపు ప్రశ్నించింది.
Updated Date - 2023-01-14T19:30:15+05:30 IST