Rashtrapati Bhavan : రాష్ట్రపతి భవన్లో అతి ముఖ్యమైన మార్పు
ABN, First Publish Date - 2023-01-28T20:13:22+05:30
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును ‘అమృత్ ఉద్యాన్’గా కేంద్ర ప్రభుత్వం
న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును ‘అమృత్ ఉద్యాన్’గా కేంద్ర ప్రభుత్వం శనివారం మార్చింది. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భంగా నిర్వహిస్తున్న అమృత మహోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఈ పేరును పెట్టింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu)కు డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ నావికా గుప్తా ఈ వివరాలను తెలిపారు.
నావికా గుప్తా మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలైన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan)లోని ఉద్యానవనాలకు సమష్టి పేరును రాష్ట్రపతి పెట్టారని తెలిపారు. వీటికి అమృత్ ఉద్యాన్ (Amrit Udyan) అని నామకరణం చేశారన్నారు.
అమృత్ ఉద్యాన్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం (జనవరి 29న) ప్రారంభిస్తారని తెలిపారు. జనవరి 31 నుంచి మార్చి 26 వరకు ప్రజలు ఈ ఉద్యాన వనాన్ని సందర్శించవచ్చునని తెలిపారు. మార్చి 28 నుంచి 31 వరకు రైతులు, దివ్యాంగులు వంటి ప్రత్యేక బృందాలు సందర్శించేందుకు అనుమతిస్తామన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఇక్కడి పూలు విరబూస్తాయన్న సంగతి తెలిసిందే.
అమృత్ ఉద్యాన్‌లో చతురస్ర ఉద్యానవనం, సుదీర్ఘ ఉద్యానవనం, వృత్తాకార ఉద్యానవనం, హెర్బల్ ఉద్యానవనం, మ్యూజికల్ గార్డెన్, ఆధ్యాత్మిక ఉద్యానవనం ఉంటాయి. మొఘల్ గార్డెన్ అని పేరు ఉన్న ఫలకాలను శనివారం తొలగించి, అమృత్ ఉద్యాన్ అనే పేరుగల ఫలకాలను ఏర్పాటు చేశారు. మొఘల్ గార్డెన్స్ రూపకర్త సర్ ఎడ్వర్డ్ లుటియెన్. దేశ రాజధాని నగరంలోని లుటియెన్ జోన్ రూపశిల్పి కూడా ఆయనే.
Updated Date - 2023-01-28T20:13:25+05:30 IST