Deepfake Videos: డీప్‌ఫేక్ వీడియోలపై కేంద్రం దూకుడు.. వారిని కలిసేందుకు రంగం సిద్ధమన్న ఐటీ మంత్రి
ABN, First Publish Date - 2023-11-18T21:08:55+05:30
ఇప్పుడు దేశంలో డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, కొందరు దుండగులు ఈ డీప్‌ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. అభ్యంతకరమైన వీడియోలను ఎంపిక చేసుకొని
Ashwini Vaishnaw: ఇప్పుడు దేశంలో డీప్‌ఫేక్ వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతను అడ్డం పెట్టుకొని, కొందరు దుండగులు ఈ డీప్‌ఫేక్ వీడియోలను సృష్టిస్తున్నారు. అభ్యంతకరమైన వీడియోలను ఎంపిక చేసుకొని, వాటికి సెలెబ్రిటీల ఫోటోలను ఎటాచ్ చేసి, సోషల్ మీడియాలో వైరల్ చేస్తుండటం ఆందోళణకు గురి చేస్తోంది. రష్మిక మందణ్ణ వీడియోతో ఈ సమస్య తీవ్రతరం అయ్యింది. ఈ నేపథ్యంలోనే.. కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్రం రంగంలోకి దిగింది. ఇప్పటికే దీనిపై కేసు నమోదు అవ్వగా.. తాజాగా ఈ సమస్యపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను కలిసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం స్పష్టం చేశారు.
డీప్‌ఫేక్‌లను తొలగించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు తగిన చర్యలు తీసుకోకపోతే.. సేఫ్ హార్బర్ ఇమ్యూనిటీ నిబంధన వర్తించదని అశ్విని వైష్ణవ్ హెచ్చరించారు. ఈ సమస్యపై ప్రభుత్వం ఇటీవల కంపెనీలకు నోటీసు జారీ చేసిందని, అందుకు సామాజిక మాధ్యమాలు స్పందించాయని తెలిపారు. అయితే అలాంటి కంటెంట్‌పై చర్యలు తీసుకోవడంలో సంస్థలు మరింత దూకుడుగా వ్యవహరించాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ‘‘సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ తగిన చర్యలైతే తీసుకుంటున్నారు కానీ, మరింత దూకుడుగా అడుగులు వేయాల్సి ఉంటుందని మేము భావిస్తున్నాం. మేము కూడా త్వరలోనే ప్లాట్‌పామ్స్‌తో సమావేశం కాబోతున్నాం. ఈ డీప్‌ఫేక్ వీడియోల్ని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారికి సూచనలిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ తగిన చర్యలు తీసుకోకపోతే మాత్రం.. ఐటీ చట్టం కింద పొందుతున్న ‘సురక్షితమైన హార్బర్ ఇమ్యూనిటీ’ని ఆ ప్లాట్‌ఫామ్స్ కోల్పోతాయని అశ్విని వైష్ణవ్ వార్నింగ్ ఇచ్చారు.
ఇదిలావుండగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొందరు దుండగులు ప్రముఖ నటీనటుల్ని లక్ష్యంగా చేసుకొని ‘డీప్‌ఫేక్’ వీడియోలను సృష్టిస్తున్నాయి. తొలుత రష్మక వీడియో బయటకు రాగా.. క్రమంగా ఇతర సెలెబ్రిటీల వీడియోలు సైతం వైరల్‌గా మారాయి. ఇటీవల కాజోల్ వీడియో కూడా చక్కర్లు కొట్టింది. దీంతో.. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహాలతో పాటు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడే చర్యలు తీసుకోకపోతే.. ఇది మరింత వినాశనానికి దారితీయొచ్చని అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రధాని మోదీ సైతం దీనిపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. ఏఐ దుర్వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించాలని మీడియాని కోరారు.
Updated Date - 2023-11-18T21:08:57+05:30 IST