Chandrayaan-2: హాయ్ బడ్డీ.. వెల్‌కమ్!
ABN, First Publish Date - 2023-08-22T02:32:13+05:30
ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-2(Chandrayaan-2)లోని ఆర్బిటర్.. తాజాగా చంద్రయాన్-3తో టచ్‌లోకి వచ్చింది.
ల్యాండర్‌ను పలకరించిన చంద్రయాన్-2 ఆర్బిటర్
విక్రమ్ ల్యాండర్‌తో అనుసంధానించిన ఇస్రో
జాబిల్లికి అవతలి వైపు ఫొటోలు పంపిన ల్యాండర్
సాఫ్ట్ ల్యాండింగ్ ప్రాంతం కోసం అన్వేషణ
చంద్రుని దక్షిణ ధ్రువంపై రేపే ల్యాండింగ్
సూళ్లూరుపేట, బెంగళూరు, ఆగస్టు 21: ఎప్పుడో నాలుగేళ్ల క్రితం ఇస్రో(ISRO) ప్రయోగించిన చంద్రయాన్-2(Chandrayaan-2)లోని ఆర్బిటర్.. తాజాగా చంద్రయాన్-3తో టచ్‌లోకి వచ్చింది. అప్పట్లో చంద్రయాన్-2 విఫలమైనా ఇప్పటికీ చంద్ర కక్ష్యలోనే తిరుగుతున్న ఆర్బిటర్.. (ప్రధాన్) చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అన్వేషణ సాగిస్తున్న విక్రమ్ ల్యాండర్(Vikram Lander)కు ‘‘వెల్‌కమ్ బడ్డీ’’ అంటూ స్వాగతం పలికింది. ప్రస్తుతం చంద్ర కక్ష్యలో ఉన్న ఈ రెండింటినీ ఇస్రో శాస్త్రవేత్తలు అనుసంధానించారు. దీంతో ఆర్బిటర్.. సోమవారం ల్యాండర్‌కు స్వాగత సందేశం పంపింది.
మరోవైపు జాబిల్లిపై కాలుపెట్టే చారిత్రక ఘట్టం కోసం శరవేగంగా అడుగులు వేస్తున్న చంద్రయాన్-3లోని విక్రమ్ ల్యాండర్(Vikram Lander) దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలోనే భూమివైపు నుంచి మనకు ఎప్పుడూ కనిపించని చంద్రుని అవతలివైపు (దక్షిణ ధ్రువ ప్రాంతం) ఫొటోలను తన కెమెరాలో బంధించి పంపించింది. ఆ ఫొటోలను ఇస్రో సోమవారం ట్విటర్‌లో షేర్ చేసింది. విక్రమ్‌కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా (ఎల్‌హెచ్‌డీఏసీ) ఈ ఫొటోలు తీసింది. దక్షిణ ధ్రువం ప్రాంతంలో బండరాళ్లు, లోతైన కందకాలు లేని ప్రదేశం కోసం అన్వేషించే క్రమంలో ఈ నెల 19న ల్యాండర్ ఈ ఫొటోలు తీసినట్లు ఇస్రో వెల్లడించింది. తాజా ఫొటోల్లోనూ జాబిల్లి ఉపరితలంపై అనేక బిలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ల్యాండర్ విఫలమయ్యే సమస్యే లేదు
చంద్రయాన్-3 ద్వారా చంద్రుడిపైకి పంపిన విక్రమ్ ల్యాండర్‌లో అంతర్నిర్మిత ‘‘సాల్వేజ్ మోడ్’’ ఉందని, ఇది ఎలాంటి తప్పు జరిగినా సరే ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్‌కు సహకరిస్తుందని బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్) ఏరోస్పేస్ శాస్త్రవేత్త ప్రొఫెసర్ రాధాకాంత్ పాధి అన్నారు. చంద్రయాన్-2లో ల్యాండర్ వేగాన్ని నియంత్రించకపోవడంతో అది విఫలమైందని, అల్గోరిథం వైఫల్యం కారణంగా ఇది జరిగిందని చెప్పారు. అయితే చంద్రయాన్-3లో ఆ లోపాన్ని సరిదిద్దారని, విక్రమ్ ల్యాండర్ కాళ్లను మరింత ద్రుఢంగా రూపొందించారని పేర్కొన్నారు. రష్యాకు చెందిన లూనా-25 వైఫల్యం చంద్రయాన్-3పై ఎలాంటి ప్రభావం చూపబోదని ఇస్రో మాజీ చైర్మన్లు కె శివన్, మాధవన్ నాయర్ అన్నారు. రష్యా ఇటీవల ప్రయోగించిన లూనా-25లోని ల్యాండర్ సోమవారం చంద్రుని ఉపరితలంపై దిగాల్సి ఉండగా.. ఈ నెల 19న అది చంద్రునిపై క్రాష్ ల్యాండ్ అయింది.
చంద్రయాన్ 3పై ప్రకాశ్ రాజ్ ఎద్దేవా
చంద్రయాన్-3(Chandrayaan-3) ప్రయోగాన్ని వెక్కిరిస్తున్నట్లుగా నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj) ఆదివారం చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట కలకలం రేపుతోంది. ఒక టీ అమ్మే వ్యక్తి ఉన్న కార్టూన్‌ను ట్వీట్ చేసిన ప్రకాశ్, చంద్రయాన్ విక్రమ్ ల్యాండర్ నుంచి ఇప్పుడే అందిన తొలి వీక్షణ అంటూ ఆ చిత్రానికి వ్యాఖ్యానించారు. కార్టూన్‌లో ఉన్నది ఫలానా అని ఆయన చెప్పకపోయినప్పటికీ.. ఇస్రో మాజీ చీఫ్ కే శివన్‌ను పోలి ఉన్న చిత్రాన్ని ప్రకాశ్ ట్వీట్ చేశారంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. ఇస్రోను రాజకీయాలకు అతీతంగా చూడాలంటూ ఒకరు హితవు పలకగా, చంద్రయాన్-3ని చేపట్టింది ఇస్రో తప్ప బీజేపీ కాదని, ఆ విషయాన్ని ప్రకాశ్‌రాజ్ గుర్తుంచుకోవాలని ఇంకో నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిథి అభిషేక్ సింఘ్వీ సైతం ప్రకాశ్ రాజ్ ట్వీట్‌ను ఖండించారు. ఇస్రో విజయం భారత విజయం అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. కాగా.. తన ట్వీట్ కేవలం ఒక పాత ట్వీట్‌ను ఉద్దేశించి హాస్యానికి చేశానని ప్రకాశ్ రాజ్ సోమవారం మరో ట్వీట్‌లో వివరణ ఇచ్చారు.
Updated Date - 2023-08-22T04:22:29+05:30 IST