Chendur Express: 4 రోజుల తర్వాత చెన్నై చేరిన చెందూరు ఎక్స్‌ప్రెస్
ABN, Publish Date - Dec 21 , 2023 | 11:16 AM
వరదల కారణంగా తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేసిన చెందూరు ఎక్స్‌ప్రెస్(Chendur Express)లో మూడురోజులుగా అవస్థల పాలైన సుమారు 500 మంది ప్రయాణికులు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): వరదల కారణంగా తూత్తుకుడి జిల్లా శ్రీవైకుంఠం రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేసిన చెందూరు ఎక్స్‌ప్రెస్(Chendur Express)లో మూడురోజులుగా అవస్థల పాలైన సుమారు 500 మంది ప్రయాణికులు ఎట్టకేలకు ప్రత్యేక రైలులో బుధవారం ఉదయం ఎగ్మూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. ఈనెల 17వ తేది రాత్రి 800 మందికిపైగా ప్రయాణికులతో చెందూరు ఎక్స్‌ప్రెస్ తిరుచెందూరు నుంచి చెన్నైకి బయలుదేరింది. మార్గమధ్యంలో భారీ వర్షాలు కురిసి, పట్టాల కింద ఉధృతంగా నీరు ప్రవహిస్తుండటంతో ఆ రైలును శ్రీవైకుంఠం రైల్వేస్టేషన్‌లో నిలిపి వేశారు. ఆ రైలులో సుమారు 300 మంది ప్రయాణికులు అక్కడి స్కూలులో తలదాచుకున్నారు. ఆ తర్వాత రైలులో ఉన్న 500 మంది ప్రయాణికులను కాపాడేందుకు వైమానిక దళం, అగ్నిమాపక దళం, జాతీయ విపత్తుల నిర్వహణ బృందం సభ్యులు శతవిధాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు జాతీయ విపత్తుల నిర్వహణ బృందం రైలు బోగీల్లో తలదాచుకుంటున్న ప్రయాణికులను పొడవాటి తాళ్లను కంచెలా ఏర్పాటు చేసి వెలుపలికి తీసుకొచ్చారు. ఇలా మంగళవారం మధ్యాహ్నం నుండి రాత్రి వరకు ప్రయాణికులను తాళ్లద్వారా, మిట్ట ప్రాంతానికి చేర్చారు. ఆ తర్వాత అందరినీ ప్రత్యేక రైలెక్కించారు. ఆ రైలు రాత్రి 11 గంటలకు మణియాచ్చి రైల్వేస్టేషన్ నుంచి చెన్నైకి బయలుదేరింది. 508 మందితో బయలుదేరిన ఆ రైలు కోవిల్‌పట్టి, సాత్తూరు, విరుదునగర్, మదురై, దిండుగల్, తిరుచ్చి, తంజావూరు, కుంభకోణం, చిదంబరం నగరాల మీదుగా గురువారం ఉదయం చెన్నై ఎగ్మూరు రైల్వేస్టేషన్ చేరింది. అప్పటికే అక్కడ వారి రాక కోసం కుటుంబీకులు ఎగ్మూరు రైల్వేస్టేషన్ వద్ద గుమికూడారు. ఈ రైలులో ప్రయాణించిన వారికి రాత్రి భోజన సదుపాయం, ఉదయం అల్పాహారం అందించారు. గురువారం ఉదయం 10.30 గంటలకు ఎగ్మూరు చేరుకోవాల్సిన ఆ ప్రత్యేక రైలు ఆలస్యంగా గమ్యస్థానం చేరింది. ఎగ్మూరు రైల్వేస్టేషన్ చేరుకున్న వీరంతా మూడు రోజుల తర్వాత కుటుంబీకులను చూడగానే సంతోషించారు.ఈ సందర్భంగా కొంతమంది ప్రయాణికులు మాట్లాడుతూ మూడు రోజులు రైలు బోగీలలోనే తలదాచుకున్నామని చెప్పారు.
Updated Date - Dec 21 , 2023 | 11:25 AM