Chennai: చెన్నైవాసులకు ఓ గుడ్ న్యూస్.. అదేంటో తెలిస్తే...
ABN, First Publish Date - 2023-04-27T12:59:40+05:30
చెన్నై మహానగర ప్రజలకు రాష్ట్రప్రభుత్వం ఎట్టకేలకు ఓ శుభవార్త చెప్పింది. ఇకనుంచి నిరంతరంగా
ప్యారీస్(చెన్నై): రాజధాని చెన్నై నగర ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు సరఫరా చేసేలా 20 టీఎంసీ సామర్థ్యం కలిగిన జలాశయాలు ఏర్పాటు చేయనున్నట్లు చెన్నై మెట్రో వాటర్ బోర్డు(Chennai Metro Water Board) అధికారులు తెలిపారు. తిరువళ్లూర్ జిల్లాలో ఉన్న పుళల్, పూండి, చోళవరం, చెంబరంబాక్కం, తేర్వాయ్ కండిగ రిజర్వాయర్లు, కడలూరు జిల్లా వీరాణం చెరువు ద్వారా చెన్నైవాసుల తాగునీటి అవసరాలు తీరుస్తున్నారు. ఈ జలాశయాల పూర్తి సామర్థ్యం 13.2 టీఎంసీలు కాగా, చెన్నైవాసులకు నెలకు 1 టీఎంసీ తాగునీరు అవసరం. అంతేకాకుండా చెంబరంబాక్కం చెరువు నుంచి కాంచీపురం(Kanchipuram) జిల్లాలో ఉన్న కర్మాగారాలకు అవసరమైన నీటిని కూడా సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, చెన్నైవాసుల తాగు, కర్మాగారాల నీటి అవసరాలు రెండింతలు పెంచేలా జలవనరుల శాఖ పలు చర్యలు చేపట్టింది. ఆ మేరకు ప్రస్తుతం చోళవరం, పూండి, చెంబరంబాక్కం రిజర్వాయర్‌లలో రూ.20.4 కోట్లతో పూడికతీత పనులు చేపట్టారు. పుళల్ రిజర్వాయర్‌లో రూ.9.90 కోట్లతో చేపట్టిన పూడికతీత పనులు పూర్తయితే చుట్టపక్కల ఉన్న నాలుగు రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 1.90 టీఎంసీలుగా పెరుగుతుంది. కాగా, 2035వ సంవత్సరంలోపు చెన్నై, కర్మాగారాల నీటి అవసరాలు తీర్చేలా 20.5 టీఎంసీల నీటిని నిల్వచేసేలా రిజర్వాయర్‌లలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
Updated Date - 2023-04-27T12:59:40+05:30 IST