Chennai: మానవ సంచార నిషేధిత ప్రాంతంగా.. ఇస్రో రాకెట్ కేంద్రం
ABN, First Publish Date - 2023-10-08T08:53:46+05:30
తూత్తుకుడి జిల్లాలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్న కులశేఖరపట్టినం
- కేంద్ర హోంశాఖ ఉత్తర్వు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తూత్తుకుడి జిల్లాలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మాణ పనులు జరుగుతున్న కులశేఖరపట్టినం ప్రాంతాన్ని మానవ సంచార నిషేధిత ప్రాంతంగా కేంద్ర హోంశాఖ ప్రకటించింది. శ్రీహరికోట(Sriharikota)లోని రాకెట్ ప్రయోగ కేంద్రంలో దేశవిదేశాలకు చెందిన ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రయోగించే సేవలు అధికం కావడంతో అదనంగా మరో రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆ మేరకు తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్టినం(Kulasekharapattinam of Thoothukudi District)లో 2300 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రాంతాన్ని రాకెట్ ప్రయోగ కేంద్రానికి అనువైన ప్రాంతంగా ఎంపిక చేసింది. రాష్ట్రప్రభుత్వం స్థల సేకరణ జరిపి ఆ స్థలాన్ని ఇస్రోకు అప్పగించింది. దీనితో రూ.6.24 కోట్లతో రాకెట్ ప్రయోగ కేంద్ర ప్రాంతం చుట్టూ ప్రహరీ నిర్మించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రాకెట్ ప్రయోగ కేంద్రంలో బరువు తక్కువగా ఉన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించే అవకాశాలున్నాయి. ఈ రాకెట్ ప్రయోగ కేంద్ర నిర్మాణ పనులను ఇస్రో చైర్మన్ సోమనాథ్ తరచూ పరిశీలిస్తూ కట్టడనిర్మాణ విభాగం ఇంజనీర్లకు తగు సలహాలను అందిస్తున్నారు. ఈ రాకెట్ ప్రయోగ కేంద్రం నిర్మాణం పూర్తయితే దక్షిణాది జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువకులు సుమారు మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయని చెబుతున్నారు.
రాష్ట్రప్రభుత్వం ఈ రాకెట్ ప్రయోగ కేంద్రానికి అవసరమైన విడిభాగాల తయారీ కేంద్రాలను కూడా సమీప ప్రాంతంలోనే ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పించనుంది. ప్రస్తుతం శ్రీహరికోట(Sriharikota) అంతరిక్ష ప్రయోగ కేంద్రానికి రాకెట్ ఇంధనం, విడిభాగాలను తిరునల్వేలి జిల్లా మహేంద్రగిరి నుంచి కేరళలోని తుంబా ప్రాంతం నుండి తరలిస్తున్నారు. కులశేఖరపట్టినం రాకెట్ కేంద్రం నిర్మాణం పూర్తయితే ఆ రెండు ప్రాంతాల నుంచి రాకెట్ విడిభాగాలు, ఇంధనం తరలింపులకు వ్యయభారం తగ్గుతుందని ఇంజనీరింగ్ నిపుణులు తెలిపారు. మహేంద్రగిరి, తుంబా ప్రాంతాలకు వంద కిలోమీటర్ల దూరంలోనే కులశేఖరపట్టినం ఉండటంతో ఇంధనం, విడిభాగాలను తక్కువ ఖర్చుతో తరలిస్తారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కులశేఖరపట్టినం ఇస్రో రాకెట్ ప్రయోగ కేంద్రం ప్రాంతాన్ని మానవ సంచార నిషేధిత ప్రాంతంగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉత్తర్వు జారీ చేసింది. ఇస్రో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా సాధారణ వ్యక్తులెవరూ కులశేఖరపట్టినం రాకెట్ ప్రయోగ కేంద్రం ప్రాంతంలో అడుగుపెట్టకూడదని ఆ ఉత్తర్వులో హెచ్చరించారు.
Updated Date - 2023-10-08T08:53:46+05:30 IST