Chennai: టి.నగర్ స్కైవాక్ షురూ..
ABN, First Publish Date - 2023-05-17T08:24:46+05:30
టి.నగర్ బస్సు డిపో - మాంబళం రైల్వే స్టేషన్లను కలుపుతూ పాదాచారుల కోసం నిర్మించిన స్కైవాక్ వంతెనను
అడయార్(చెన్నై): స్థానిక టి.నగర్ బస్సు డిపో - మాంబళం రైల్వే స్టేషన్లను కలుపుతూ పాదాచారుల కోసం నిర్మించిన స్కైవాక్(Skywalk) వంతెనను మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో పాదచారులు కేవలం ఐదు నిమిషాల్లోనే బస్సు డిపో నుంచి రైల్వే స్టేషన్‌కు చేరుకోచ్చు. ఈ ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రులు కేఎన్ నెహ్రూ, ఎం.సుబ్రమణి, ఉదయనిధి, దక్షిణ చెన్నై ఎంపీ తమిళచ్చి తంగపాండ్యన్, ఎమ్మెల్యేలు మయిలై టి.వేలు, జె.కరుణానిధి(J. Karunanidhi), నగర మేయర్ ఆర్.ప్రియ, డిప్యూటీ మేయర్ ఎం.మహేష్ కుమార్, గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జె.రాధాకృష్ణన్, ప్రభుత్వ అదనపు క్యాదర్శి శివదాస్ మీనా తదితరులు పాల్గొన్నారు. ఈ వంతెన నిర్మాణం గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ప్రారంభం కాగా, ఇప్పటికి పూర్తయ్యాయి. సుమారు కిలోమీటరకు మేరకు పొడవుతో ఉండే ఈ వంతెనకు ఎస్కలేటర్లు, లిఫ్టు, జనరేటర్ వంటి సౌకర్యాలు కల్పించారు. చెన్నై(Chennai)లోనే ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న టి.నగర్‌కు వచ్చే నగరవాసులు, కొనుగోలుదారులు స్థానిక బస్సు డిపో నుంచి మాంబళం రైల్వే స్టేషన్‌ల మధ్య సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా ఈ వంతెన ఏర్పాటైంది. ఈ రెండు ప్రాంతాల మధ్య పాదాచారుల రద్దీని తగ్గించేందుకు ఈ వంతెన ఎంతగానో దోహదపడుతుంది. బస్సు డిపో నుంచి మ్యాడ్లీ సాలై, బార్డర్ సాలై మీదుగా మాంబళం స్టేషన్‌కు వరకు 13 అడుగుల వెడల్పు, 1968 అడుగుల పొడవుతో ఈ వంతెనను స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నిర్మించారు. ఈ వంతెన మీదుగా డిపో నుంచి రైల్వే స్టేషన్‌కు, రైల్వే స్టేషన్ నుంచి డిపోకు కేవలం ఐదారు నిమిషాల్లో చేరుకోవచ్చు. మాంబాళం రైల్వే స్టేషన్‌కు ప్రతి రోజూ వచ్చే 50 వేల మంది ప్రయాణికులకు ఈ వంతెన ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
తమిళ సంస్కృతి ప్రతిబింభించేలా...
ఈ వంతెన నిర్మాణం లోపలి భాగంలో తమిళ సంస్కృతి సంప్రదాయం ప్రతిబింబించేలా పెయింటింగ్స్ వేశారు. ఈ స్కైవాక్‌కు సమీపంలో ఉన్న చెట్లపై కూడా రంగురంగుల పక్షుల బొమ్మలను అమర్చారు. అలాగే, వికలాంగులు కూడా ఈ వంతెనను వినియోగించుకునేలా చక్రాల వాహనం ఎక్కేందుకు, దిగేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బస్సు డిపో వైపు ఆటోమేటిక్ ఎస్కలేటర్ వసతిని కల్పించారు. ఉస్మాన్ రోడ్డు వైపున లిఫ్టు సౌకర్యం ఏర్పాటు చేశారు. వంతెన పొడవున విద్యుత్ లైట్లతో పాటు సీసీ కెమెరాలను అమర్చారు. మాంబాళం పోలీస్ స్టేషన్ నుంచి ఈ సీసీ కెమెరాలను పర్యవేక్షించనున్నారు.
Updated Date - 2023-05-17T08:24:46+05:30 IST