Chief Minister: ఏప్రిల్ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్ బస్సులు
ABN, Publish Date - Dec 27 , 2023 | 12:51 PM
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి వచ్చే ఏప్రిల్ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్ బస్సులను సమకూర్చనున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు.
- ముఖ్యమంత్రి సిద్దరామయ్య
- తొలిదశలో వంద బస్సులకు పచ్చజెండా
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి వచ్చే ఏప్రిల్ నాటికి 1400 కొత్త ఎలక్ట్రికల్ బస్సులను సమకూర్చనున్నట్టు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ప్రకటించారు. తొలిదశలో సిద్ధమైన 100 ఎలక్ట్రికల్ బస్సుల సంచారానికి మంగళవారం ఆయన విధానసౌధ ప్రాంగణంలో ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar)తో కలసి పచ్చజెండా చూపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రతినిత్యం 40 లక్షల మంది మహిళలు బీఎంటీసీ బస్సుల్లో కులమతాలు, భాషలకు అతీతంగా ఉచిత ప్రయాణం చేస్తున్నారని అన్నారు. ఇంత వరకు 120 కోట్ల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని అన్నారు. మహిళల ఉచిత ప్రయాణం శక్తి పథకంపై ప్రారంభంలో ప్రతిపక్షాలు చులకనగా మాట్లాడాయన్నారు. ఆచరణలో దీన్ని విజయంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గ్యారెంటీ పథకాలు 4.30 కోట్ల మందికి నేరుగా అందుతున్నాయన్నారు. రవాణాశాఖ మంత్రి ఆర్.రామలింగారెడ్డి మాట్లాడుతూ టాటా మోటార్స్ స్మార్ట్‌సిటీ మొబిలిటీ సొల్యూషన్స్ సంస్థ రూపొందించిన ఈ ఎలక్ట్రికల్ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయన్నారు. సింగిల్ బ్యాటరీ చార్జ్‌తో 200 కిలోమీటర్ల మేర నిరాంటంకంగా పనిచేస్తాయన్నారు. వీటిలో 35 మంది ఆశీనులయ్యే అవకాశం ఉందని, 3 సీసీటీవీ కెమెరాలు కూడా ఉంటాయన్నారు. మిగిలిన 1300 ఎలక్ట్రికల్ బస్సులు కూడా త్వరలోనే సిద్ధం చేయనున్నట్టు సంస్థ భరోసా ఇచ్చిందన్నారు. కాగా దేశంలో మరెక్కడా లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు రూ.1.20 కోట్ల బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన వంద ఎలక్ట్రికల్ బస్సులు కోరమంగల, కాడుగూడి, సర్జాపుర, ఎలకా్ట్రనిక్‌సిటీ, ఆనేకల్, బన్నేరుఘట్ట నేషనల్‌పార్క్, చందాపుర, అత్తిబెలె, హారోహళ్ళి తదితర ప్రాంతాలలో సంచరిస్తాయన్నారు. పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2023 | 12:51 PM