Chief Minister: ప్రధాని వ్యాఖ్యలపై సీఎం ఆగ్రహం.. ప్రజలను రెచ్చగొట్టడం సరికాదు
ABN, First Publish Date - 2023-09-08T11:45:44+05:30
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు తగిన బదులు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ శ్రేణులకు
- అరాచక వాతావరణం ఏర్పడితే ఆయనదే బాధ్యత: సిద్దూ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి చేసిన వ్యాఖ్యలకు తగిన బదులు ఇవ్వాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ శ్రేణులకు ఇచ్చిన పిలుపు రెచ్చగొట్టేలా ఉందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Karnataka Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. బెంగళూరులో గురువారం సీఎం మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ(Prime Minister Modi) తాజా పిలుపు రాజ్యాంగ విరుద్ధంగా ఉందన్నారు. ఈ వ్యాఖ్యలను ప్రధాని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎవరు తప్పుచేసినా చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందని అయితే తగిన బదులివ్వాలంటూ మోదీ వ్యా ఖ్యలుచేయడం ఆయన హోదాకు తగవన్నారు. ఇది రాజరికం కాదని ప్రజాస్వామ్య దేశమని రాజ్యాంగానికి లోబడి వ్యహరించాల్సి ఉంటుందని సీఎం గుర్తుచేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా ప్రజలను రెచ్చగొట్టడం ప్రధాని మోదీకి తగదన్నారు.
ఒకవేళ దేశంలో అశాంతి అరాచక వాతావరణం ఎర్పడితే అందుకు ఆయనే పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ప్రధాని బీజేపీ నేతలాగా, సంఘ్‌పరివార్ ప్రతినిధిలా మాట్లాడుతున్నారని దేశంలోని 140కోట్ల మందికి తాను ప్రధానిగా జవాబ్దారీగా ఉన్నానన్న సంగతిని మరిచిపోయారని సిఎం వ్యాఖ్యానించారు. ప్రధాని తాజా పిలుపు బీజేపీలో రానున్న ఓటమి భయాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. గతంలో గుజరాత్ మారణ హోమం తాలుకూ దారుణాలు ఇంకా ప్రజలను వెన్నాడుతూనే ఉన్నాయని ఇప్పుడు సనాతన ధర్మం వివాదం ద్వారా చలిమంటలు కాచుకునేందుకు బీజేపీ సిద్ధమవుతోందని ఆయన ఆరోపించారు. వాజ్‌పేయు పాలనను చూసైనా రాజధర్మం పాటించడం నేర్చుకోవాలని ప్రధానికి సీఎం విజ్ఞప్తిచేశారు. ఉదయ్‌నిధి వ్యాఖ్యలు, మోదీ పిలుపు గమనిస్తే ఇద్దరికీ తేడా ఏముందని సీఎం ప్రశ్నించారు.
Updated Date - 2023-09-08T11:45:46+05:30 IST