Chief Minister: రాజకీయాలకు అతీతంగా ఒకే గళం వినిపిద్దాం..
ABN, First Publish Date - 2023-09-21T11:55:07+05:30
రాష్ట్ర జలాలు, భాష, సంస్కృతి పరిరక్షణలో రాజకీయాలకు అతీతంగా ఒకే గళం వినిపించడం ద్వారా ఐక్యతను చాటుకుందామని
- కావేరి వివాదంపై ఎంపీలకు సీఎం వినతి
- ప్రధాని జోక్యం చేసుకోవాలి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర జలాలు, భాష, సంస్కృతి పరిరక్షణలో రాజకీయాలకు అతీతంగా ఒకే గళం వినిపించడం ద్వారా ఐక్యతను చాటుకుందామని ఎంపీలకు ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పిలుపునిచ్చారు. కావేరి జల వివాదం తాజా స్థితిపై చర్చించేందుకు ఢిల్లీలో బుధవారం ఆయన రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులతోనూ, ఎంపీలతోనూ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కావేరి జలాల నిర్వహణా ప్రాధికార ఆదేశాల నేపథ్యంలోనే సమస్య జఠిలంగా మారిందని, సుప్రీంకోర్టులో పోరాడుతూనే రాజకీయ పరిష్కారం సాధించే దిశలో తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈ వివాదాన్ని రాజకీయం చేయవద్దని సీఎం పలుమార్లు సభలో సూచించినప్పుడు... తమిళనాడుకు నీరు విడుదల చేసి ఇప్పుడు సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనం ఏంటని కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజె నేరుగా నిలదీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. తమిళనాడుకు నీటి విడుదల ప్రశ్న కాదని... రాష్ట్ర రిజర్వాయర్లలో తగిన ప్రమాణంలో నీరు లేనప్పుడు ప్రాధికార ఆదేశాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేశాయని సీఎం వివరించినట్టు తెలుస్తోంది. ఆగస్టు తర్వాత కర్ణాటక రాష్ట్రం(Karnataka State)లో క్రమేపీ నిలిచిపోతాయని, తమిళనాడుకు ఆగస్టు తర్వాత వర్షాలు కురుస్తాయని సీఎం పేర్కొన్నారు. పొరుగురాష్ట్రాలతో ఉత్తమ సంబంధాలు కలిగి ఉండాలన్న ఉద్దేశ్యంతోనే తమ ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ ఎంపీల సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైందన్నారు. ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) మాట్లాడుతూ కావేరి విషయంలో ప్రభుత్వానికి సహకరిస్తామని కేంద్రమంత్రులు, ఎంపీలు హామీ ఇచ్చారన్నారు.
ప్రధాని జోక్యం చేసుకోవాలి
కావేరి జల వివాదం జఠిలంగా మారుతూ రాష్ట్ర రైతాంగం తీవ్ర సమస్యల ఊబిలో కూరుకునే ప్రమాద సంకేతాలు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య పేర్కొన్నారు. ఢిల్లీలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కావేరి జల వివాదాన్ని సామరస్యపూరితంగా పరిష్కరించేందుకు ప్రధాని నరేంద్రమోదీ తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. కావేరి విషయంలో ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశామని, అదే సమయంలో చట్టాన్ని గౌరవించామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 195 తాలూకాల్లో కరువు ఛాయలు నెలకొని ఉన్నాయన్నారు. కావేరి బేసిన్‌లో రిజర్వాయర్లలో సైతం నీరు అడుగంటుతోందన్నారు. కేవలం సాగుకే కాకుండా తాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం కూడా కావేరి జలాలపైనే ఆధారపడ్డామన్నారు. ఈ విషయాలన్నింటినీ ఆయా సందర్భాలలో కేంద్రం దృష్టికి తీసుకెళుతూనే ఉన్నామన్నారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. సమావేశంలో కేంద్రమంత్రులు ప్రహ్లాద్‌జోషి, శోభాకరంద్లాజె, భగవంత్ ఖూబా, నారాయణస్వామి, రాజీవ్‌చంద్ర శేఖర్‌తోపాటు ఎంపీలంతా పాల్గొన్నారన్నారు.
Updated Date - 2023-09-21T11:55:07+05:30 IST