Chief Minister: మండిపడ్డ సీఎం.. జల వివాదాన్ని రాజకీయం చేస్తున్నారు..
ABN, First Publish Date - 2023-09-27T11:37:02+05:30
అత్యంత సున్నితమైన కావేరి జల వివాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah)
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అత్యంత సున్నితమైన కావేరి జల వివాదాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) విరుచుకుపడ్డారు. మైసూరులో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ఉద్దేశ్యాలే తప్ప ప్రతిపక్షాలకు ప్రజాసంక్షేమం పట్టడం లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరికి నిరసన తెలిపే హక్కు ఉందని అందుకే తాము ఎక్కడా ఎవరినీ అడ్డుకోలేదనా ్నరు. కావేరి వివాదాన్ని పరిష్కరించే విషయంలో ప్రభుత్వం విఫలమైందన్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టారు. డీఎంకేకు కాంగ్రెస్ బి-టీమ్‌గా వ్యవహరిస్తోందన్న బీజేపీ ఆరోపణలు వారి చౌకబారు రాజకీయ మనఃస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. చట్టాన్ని గౌరవిస్తున్నామని, అదే సమయంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడే విషయంలో రాజీ పడబోమన్నారు.
మేకెదాటుతోనే కావేరికి పరిష్కారం: మేకెదాటు పథకంతోనే కావేరి జల వివాదానికి పూర్తిస్థాయిలో పరిష్కారం సాధ్యమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య అభిప్రాయపడ్డారు. మేకెదాటు ప్రాజెక్టు ఇప్పటికే ఏర్పాటై ఉంటే కావేరి బేసిన్‌లో 67 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం రాష్ట్రానికి ఉండేదన్నారు. రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, 25 మంది బీజేపీ ఎంపీలు కావేరి జల వివాద పరిష్కారం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకోవాలన్న మాజీ ప్రధాని దేవెగౌడను చూసి బీజేపీ నేతలు సిగ్గు తెచ్చుకుంటే మంచిదని చురకలంటించారు.
ప్రాధికార ఆదేశాలతో కొంత ఊరట: డీసీఎం
కావేరి జల నిర్వహణా ప్రాధికార తాజాగా మంగళవారం జారీ చేసిన ఆదేశాలు కొంతలో కొంత ఊరటనిచ్చాయని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజూ 12,500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసేలా కర్ణాటకను ఆదేశించాలన్న తమిళనాడు ప్రభుత్వ వాదనను ప్రాధికార తోసిపుచ్చిందన్నారు. రోజుకు 3వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలన్న ఆదేశాలపై స్పందించిన ఆయన ఇప్పటికే బిలిగుండ్లు రిజర్వాయర్ నుంచి 2వేల క్యూసెక్కుల నీరు తానంతట అదే ప్రవహిస్తోందని, వెయ్యి క్యూసెక్కుల నీరు మాత్రమే అదనంగా విడుదల చేయాల్సి ఉంటుందన్నారు. 29న రాష్ట్ర బంద్ ఆలోచనను విరమించుకోవాలని ఆయన కన్నడ సంఘాలకు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-09-27T11:37:02+05:30 IST