Chief Minister: ముఖ్యమంత్రి ఆగ్రహం.. మంత్రిని వేధించారు
ABN, First Publish Date - 2023-06-15T07:54:09+05:30
తనిఖీలు, విచారణ పేరుతో ఈడీ అధికారులు రోజంతా వేధింపులకు గురిచేయడం వల్లే మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) అస్వస్థ
- బీజేపీ కక్షసాధింపులకు ఇదే నిదర్శనం
చెన్నై, (ఆంధ్రజ్యోతి): తనిఖీలు, విచారణ పేరుతో ఈడీ అధికారులు రోజంతా వేధింపులకు గురిచేయడం వల్లే మంత్రి సెంథిల్‌బాలాజీ(Minister Senthilbalaji) అస్వస్థతకు గురయ్యారని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) ధ్వజమెత్తారు. మంత్రిని ఆస్పత్రిలో పరామర్శించిన అనంతరం సీఎం ఓ సుదీర్ఘ ప్రకటన జారీ చేశారు. కేంద్రంలోని బీజేపీ పాలకులు తమ చెప్పుచేతుల్లో ఉన్న ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను తన రాజకీయ ప్రత్యర్థులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాజకీయంగా ఎదుర్కొనలేని బీజేపీ.. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులపై ఉసిగొల్పుతోందని ఇటీవల తాను చెప్పిందే నిజమైందన్నారు. సెంథిల్‌బాలాజీ నివాస గృహంలోనూ, సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో ఈడీ అధికారులు తనిఖీల పేరుతో రోజంతా నాటకమాడారని ఆరోపించారు. ఈడీ దుందుడుకు చర్యలను తానే కాకుండా జాతీయస్థాయి నాయకులంతా తీవ్రంగా ఖండిస్తున్నారని తెలిపారు. విచారణకు సహకరిస్తారని పదేపదే చెబుతూ వచ్చిన సెంథిల్‌బాలాజీని వేకువజామున 1గంట వరకు విచారణ పేరుతో వేధించి, అరెస్టు చేయడం చట్ట వ్యతిరేకమన్నారు. ఈ విషయంలో తాము చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఏది ఏమైనప్పటికీ కేంద్రంలోని బీజేపీ పాలకుల అప్రజాస్వామిక చర్యలను, ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతుండటాన్ని గమనిస్తున్న దేశ ప్రజలంతా 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని స్టాలిన్ పేర్కొన్నారు.
Updated Date - 2023-06-15T07:54:09+05:30 IST