Chief Minister: విద్యుత్‌శాఖ అధికారులపై సీఎం సీరియస్
ABN, First Publish Date - 2023-09-23T09:44:36+05:30
రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా విద్యుత్ ఉత్పాదన తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు.
- ఉత్పాదన తగ్గుదలపై మండిపాటు
- లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా విద్యుత్ ఉత్పాదన తగ్గుముఖం పట్టడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తీవ్ర ఆక్రోశం వ్యక్తం చేశారు. బెంగళూరులోని అధికార నివాసం కృష్ణలో శుక్రవారం ఆయన విద్యుత్‌శాఖ ప్రగతి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో విద్యుత్ ఉత్పాదనా సామర్థ్యం 32,009 మెగావాట్లు ఉండగా ఎందుకు లక్ష్యాన్ని అందుకోలేకపోయామని అధికారులను నిలదీశారు. తాను మొదటిసారి సీఎం అయిన సమయంలో విద్యుత్ ఉత్పాదన రెట్టింపుగా ఉండేదని గుర్తు చేశారు. 2013-14లో 14,048 మెగావాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పాదన 2017-18 నాటికి 27,780 మెగావాట్లకు చేరుకున్న సంగతిని గుర్తు చేశారు. ఆ లెక్కన విద్యుత్ ఉత్పాదన ప్రస్తుతం లక్ష్యాలకు చాలా దగ్గరగా ఉండాల్సిందని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విద్యుత్ ఉత్పాదనపై తగిన దృష్టి సారించలేదన్న సంగతి దీంతో స్పష్టమవుతోందని మండిపడ్డారు.
ప్రత్యేకించి థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో నాణ్యమైన బొగ్గును వినియోగించాలని, అలాగే విద్యుత్ లీకేజీలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా జల విద్యుత్ ఉత్పాదన కొంతమేరకు తగ్గిందన్నారు. గృహజ్యోతి పథకం కింద ఆగస్టులో 1.26 కోట్ల మంది వినియోగదారులకు సెప్టెంబరు 1.35 కోట్ల మంది వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.1400 కోట్లను భరించిందన్నారు. విద్యుత్ కంపెనీల ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచే అంశంపై కూడా చర్చ జరిగిందన్నారు. ప్రస్తుత ఏడాది బడ్జెట్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు రూ.2,500 కోట్లు కేటాయించామన్నారు. సమావేశంలో విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్, ముఖ్యమంత్రి రాజకీయ కార్యదర్శి నసీర్ అహ్మద్, అదనపు ముఖ్యకార్యదర్శి డాక్టర్ రజనీశ్ గోయెల్, విద్యుత్‌శాఖ అదనపు ముఖ్యకార్యదర్శి గౌరవ్‌గుప్త తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-09-23T09:44:36+05:30 IST