India Vs China : భారత్‌తో సంబంధాలపై చైనా ప్రకటన
ABN, First Publish Date - 2023-09-06T14:50:52+05:30
భారత్-చైనా సంబంధాలు మొత్తం మీద నిలకడగా ఉన్నాయని చైనా తెలిపింది. జీ20 సదస్సుకు తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాకపోయినప్పటికీ, అది విజయవంతమయ్యేందుకు అన్ని పక్షాలతోనూ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
న్యూఢిల్లీ : భారత్-చైనా సంబంధాలు మొత్తం మీద నిలకడగా ఉన్నాయని చైనా తెలిపింది. ఇరు దేశాల మధ్య వివిధ స్థాయుల్లో చర్చలు, కమ్యూనికేషన్ కొనసాగుతోందని చెప్పింది. జీ20 సదస్సుకు తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ హాజరు కాకపోయినప్పటికీ, అది విజయవంతమయ్యేందుకు అన్ని పక్షాలతోనూ కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జరిగే జీ20 సదస్సుకు తమ దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) హాజరుకాబోరని, ప్రధాన మంత్రి లీ కియాంగ్ హాజరవుతారని చైనా సోమవారం ప్రకటించింది. చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఓ విలేకరి మాట్లాడుతూ, జీ20 సదస్సుకు చైనా అధ్యక్షుడు కాకుండా ప్రధాన మంత్రి హాజరవుతుండటం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను ప్రతిబింబిస్తోందా? అని ప్రశ్నించారు. దీనిపై మావో నింగ్ మాట్లాడుతూ, చైనా- భారత్ సంబంధాలు మొత్తం మీద నిలకడగా ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య వివిధ స్థాయుల్లో చర్చలు, సంప్రదింపులు జరుగుతున్నాయన్నారు. చైనా-భారత్ మధ్య సంబంధాలు నిరంతరం మెరుగుపడుతున్నాయని, దీనివల్ల ఇరు దేశాలకు, ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత అభివృద్ధి చేసుకోవడం కోసం భారత దేశంతో కలిసి పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. జీ20 సదస్సుకు ఈ ఏడాది భారత దేశం అధ్యక్షత వహించడానికి తాము మద్దతిస్తున్నామన్నారు. ఈ సదస్సు విజయవంతమయ్యే విధంగా అన్ని పక్షాలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం జీ20 చాలా ముఖ్యమైన వేదిక అని తెలిపారు.
చైనా ఇటీవల విడుదల చేసిన స్టాండర్డ్ మ్యాపులో అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్‌చిన్‌లను తమ దేశ భూభాగాలుగా చూపించింది. తూర్పు లడఖ్‌లో చాలా కాలం నుంచి ఉన్న వివాదాన్ని కూడా ప్రస్తావించింది. ఈ మ్యాపును భారత ప్రభుత్వం తోసిపుచ్చింది.
ఇవి కూడా చదవండి :
Rahul Gandhi : యూరోప్ పర్యటనకు వెళ్లిన రాహుల్ గాంధీ?
India : ‘ఇండియా’ పేరుపై హక్కు పాకిస్థాన్‌దేనా?
Updated Date - 2023-09-06T15:05:48+05:30 IST