G20 invite : దేశం పేరు మార్పుపై కాంగ్రెస్ ఆగ్రహం
ABN, First Publish Date - 2023-09-05T12:26:06+05:30
ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని మండిపడింది.
న్యూఢిల్లీ : రాష్ట్రపతి భవన్ మన దేశం పేరును ‘భారత్’ అని పేర్కొనడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జీ20 దేశాధినేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఈ నెల 9న రాష్ట్రపతి భవన్‌లో విందు ఇస్తున్నారని, ఈ విందుకు హాజరుకావాలని కోరుతూ అతిథులకు పంపిన ఆహ్వాన పత్రికల్లో మన దేశం పేరును ఇండియా అని కాకుండా భారత్ అని పేర్కొన్నారని మండిపడింది. సాధారణంగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొంటారని, ఈ ఆహ్వాన పత్రికల్లో ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారని తెలిపింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్స్) జైరామ్ రమేశ్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘అయితే ఈ వార్త నిజమే. సెప్టెంబరు 9న జరిగే జీ20 విందు కోసం ఆహ్వాన పత్రాలను రాష్ట్రపతి భవన్ పంపించింది. దీనిలో ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ అని పేర్కొనడానికి బదులుగా, ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని రాశారు. ఇప్పుడు రాజ్యాంగంలోని అధికరణ 1 ఈ విధంగా ఉంటుంది : ‘భారత్, అంటే ఒకప్పటి ఇండియా, రాష్ట్రాల యూనియన్.’ కానీ ఇప్పుడు ఈ ‘రాష్ట్రాల యూనియన్’ దాడికి గురవుతోంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
జీ20 దేశాధినేతల సదస్సు న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఈ నెల 9, 10 తేదీల్లో జరుగుతుంది. ఈ ఏడాది జీ20 దేశాల కూటమికి భారత దేశం అధ్యక్షత వహిస్తోంది.
ఇవి కూడా చదవండి :
Teachers’ Day : ఉపాధ్యాయులకు వందనం : మోదీ
Updated Date - 2023-09-05T13:14:41+05:30 IST