Sanjay Raut: అదే రిపీట్ అయితే.. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తప్పవు
ABN, First Publish Date - 2023-12-10T18:59:40+05:30
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావమే ఎదురైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహాయిస్తే.. మిగతా చోట్ల ఓటమి పాలైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో..
Sanjay Raut On Congress: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకున్న కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభావమే ఎదురైంది. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మినహాయిస్తే.. మిగతా చోట్ల ఓటమి పాలైంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ చేతిలో ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలని, బీజేపీపై పైచేయి సాధించాలని కోరుకుంటోంది. ఆ దిశగా కసరత్తులు కూడా మొదలుపెట్టేసింది. ఇలాంటి తరుణంలో.. శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీకి అనుకూలమైన రాజకీయాలు చేసే వ్యక్తులు.. గాంధీ కుటుంబం చుట్టూ ఉంటే 2024 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మరిన్ని కష్టాలు తప్పవని సంజయ్ రౌత్ కుండబద్దలు కొట్టారు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ కమల్‌నాథ్‌ని ఉద్దేశించి ఆయన ఈ షాకింగ్ కామెంట్స్ చేశారు. అలాగే.. పార్టీ మౌత్ పీస్ ‘సామ్నా’లో ఆయన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్‌లపై (ఈవీఎంఎస్) సందేహాన్ని కూడా లేవనెత్తారు. బ్యాలెట్ పేపర్ల (పోస్టల్ బ్యాలెట్) కౌంటింగ్ సందర్భంగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ 199 స్థానాల్లో ఆధిక్యంలో ఉందని.. కానీ ఈవీఎంలలోని ఓట్లను లెక్కించినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆయన పేర్కొన్నారు.
ప్రధాని మోదీ ‘విక్టరీ మ్యాజిక్’ మూడు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్) పని చేసిందని.. కానీ తెలంగాణలో పని చేయలేదని సంజయ్ రౌత్ అన్నారు. ప్రధాని మోదీని కాంగ్రెస్ ఓడించలేదు అనేది కూడా ఒక అపోహ అని, తప్పకుండా మోదీని కాంగ్రెస్ ఓడిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లలో ఆ పార్టీ బీజేపీని ఓడించిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బఘేల్ గట్టి పోటీనిచ్చారని.. అయినా ఓటమి పాలయ్యారని ఆయన చెప్పుకొచ్చారు.
Updated Date - 2023-12-10T18:59:41+05:30 IST