Calcutta High Court : ఐపీసీ సెక్షన్ 498ఏతో చట్టబద్ధ ఉగ్రవాదం : కలకత్తా హైకోర్టు
ABN, First Publish Date - 2023-08-22T14:58:34+05:30
భర్తల దుర్మార్గాల నుంచి భార్యలను కాపాడటానికి ఉద్దేశించిన చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది.
కోల్‌కతా : భర్తల దుర్మార్గాల నుంచి భార్యలను కాపాడటానికి ఉద్దేశించిన చట్టాన్ని కొందరు మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. భార్యపై భర్త, ఆయన కుటుంబ సభ్యులు క్రూరంగా ప్రవర్తించడాన్ని నిరోధించడం, వరకట్న దురాచారాన్ని నిర్మూలించడం భారత శిక్షా స్మృతి (IPC)లోని సెక్షన్ 498ఏ లక్ష్యాలని తెలిపింది. అయితే కొందరు దీనిని తమ భర్తలను వేధించడం కోసం ఉపయోగించుకుంటూ, చట్టబద్ధ ఉగ్రవాదానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టింది. ఓ భార్య తన భర్తపైనా, ఆయన బంధువులపైనా దాఖలు చేసిన రెండు క్రిమినల్ ఫిర్యాదులను రద్దు చేసింది.
హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ తీర్పు చెప్తూ, సమాజం నుంచి వరకట్న దురాచారాన్ని నిర్మూలించడం కోసం ఐపీసీ సెక్షన్ 498ఏను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఈ నిబంధనను దుర్వినియోగం చేయడం ద్వారా సరికొత్త చట్టబద్ధ ఉగ్రవాదానికి పాల్పడుతున్నట్లు చాలా కేసుల్లో కనిపించిందని చెప్పింది. ఈ సెక్షన్‌లో భద్రతకు ఇచ్చిన నిర్వచనంలో వేధింపులు, హింస గురించి చెప్పారని, వీటిని రుజువు చేయవలసినది కేవలం ఫిర్యాదుదారు మాత్రమే కాదని చెప్పింది. భర్తపై ఫిర్యాదుదారు చేసే ఆరోపణలు కేవలం ఆమె కథనం మాత్రమేనని తెలిపింది. క్రిమినల్ ఫిర్యాదును దాఖలు చేయడానికి ఫిర్యాదుదారుకు చట్టం అనుమతి ఇస్తుందని, అయితే ఆ ఆరోపణలను సరైన సాక్ష్యాధారాలతో సమర్థించవలసి ఉంటుందని తెలిపింది. ఈ కేసులో ఫిర్యాదుదారు మెడికల్ రికార్డు లేదా డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌లను దాఖలు చేయలేదని వివరించింది.
భర్త తరపు బంధువులతో కలిసి ఒకే ఇంట్లో ఉండటానికి ఫిర్యాదుదారు ఇష్టపడలేదని, ఫలితంగా పెళ్లి జరిగిన వెంటనే వేరు కాపురం పెట్టారని, అనంతరం ఫిర్యాదుదారుపై ఆమె భర్త దాడి చేసినట్లు, హింసించినట్లు రుజువుకాలేదని తెలిపింది. ఫిర్యాదుదారు కల్పిత ఆరోపణలు చేశారని వ్యాఖ్యానించింది.
ఇవి కూడా చదవండి :
Surgical Strike : భారత్ మళ్లీ పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రేక్ చేసిందా?
Bharat NCAP : కార్లకు రేటింగ్ ఇచ్చే పథకాన్ని ప్రారంభించిన నితిన్ గడ్కరీ
Updated Date - 2023-08-22T14:58:34+05:30 IST