Dantewada Naxals Attack: రెండు నెలల క్రితమే ఐఈడీ అమర్చారా?
ABN, First Publish Date - 2023-04-28T18:42:38+05:30
ఛత్తీస్‌గఢ్ లోని దంతేవాడ నక్సల్స్ దాడికి ఉపయోగించిన ఐఈడీని అరన్‌పుర్-జగర్‌గుండ రోడ్డు కింద ..
రాయపూర్: ఛత్తీస్‌గఢ్ (Chattisgarh) లోని దంతేవాడ (Dantewada) నక్సల్స్ దాడికి ఉపయోగించిన ఐఈడీ (IED)ని అరన్‌పుర్-జగర్‌గుండ రోడ్డు కింద కనీసం రెండు నెలల ముందే అమర్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈనెల 26వ తేదీన డీఆర్‌జే పోలీస్ వాహనాన్ని మావోయిస్టులు పేల్చివేసిన ఘటనలో 10 మంది భద్రతా సిబ్బంది, డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతుండగా, రెండు నెలల క్రితమే ఐఈడీని అమర్చినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పి. సుందరాజ్ శుక్రవారంనాడు మీడియాకు తెలిపరు. 40 నుంచి 50 కిలోల బరువైన ఈ పేలుడు పదార్ధాన్ని రోడ్డుకు 3 నుంచి 4 అడుగుల దిగువన అమర్చారని, ఇందుకోసం సొరంగం తవ్వారని తెలిపారు. వీటిని పేల్చేందుకు వీలుగా వైరును రోడ్డుపక్కన కొన్ని మీటల దూరంలోని పొదల వరకూ విస్తరించినట్టు చెప్పారు.
దాడికి ముందు రోజు కూడా పేలుడు పదార్ధాలను కనిపెట్టే డెమైనింగ్ ఎక్సరసైజ్ చేసినప్పటికీ ఐడీడీ కానీ, ఇతర అనుమానాస్పద వస్తువు కానీ జాడ తెలియలేదని అన్నారు. ఐఈడీని పేల్చేందుకు అమర్చిన వైరుపు మట్టి వేసి కప్పి ఉంచడం వల్ల గడ్డి కూడా మొలిచిందని చెప్పారు. ముమ్మర తనిఖీ జరిగినప్పటికీ పేలుడు పదార్ధం జాడ కనిపెట్టలేకపోవడంపై కూడా విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. ఈ దాడికి బాధ్యులమని నక్సలైట్ నాయకుడు ఎవరైనా ప్రకటించారా అని అడిగినప్పుడు, దర్బా డివిజన్ కమిటీ ఒక ప్రకటనలో పేలుడుకు తామే బాధ్యులమని ప్రకటించిందని, ఆ ఏరియాలో నక్సల్ కమాండర్‌గా జగ్దీష్ ఉన్నాడని, దర్బా డివిజన్‌లోని మలన్ గిర్ ఏరియా కమిటీ మావోయిస్టుల పాత్ర కూడా ఇందులో ఉండవచ్చని, దీనిపై కూడా దర్యాప్తు జరుపుతున్నామని ఐజీ తెలిపారు.
Updated Date - 2023-04-28T18:42:44+05:30 IST