Sanjay Raut: 'ప్రపంచ విద్రోహుల దినం'గా జూన్ 20.. ఐక్యరాజ్యసమితికి లేఖ
ABN, First Publish Date - 2023-06-20T12:04:23+05:30
శివసేన నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. జూన్ 20వ తేదీని ''ప్రపంచ విద్రోహుల దినం''గా ప్రకటించాలని ఐరాసను కోరారు. మహారాష్ట్రలో 2022 జూన్‌లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనలో రాజకీయ కల్లోలం చెలరేగిన నేపథ్యంలో రౌత్ ఈ విజ్ఞప్తి చేశారు.
ముంబై: ప్రపంచ యోగా దినోత్సవ సన్నాహకాల నేపథ్యంలో శివసేన నేత సంజయ్ రౌత్ (Sanajy Raut) ఐక్యరాజ్యసమితి (United Nations)కి లేఖ రాశారు. జూన్ 20వ తేదీని ''ప్రపంచ విద్రోహుల దినం''గా (World Traitors Day) ప్రకటించాలని ఐరాసను కోరారు. మహారాష్ట్రలో 2022 జూన్‌లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనలో రాజకీయ కల్లోలం చెలరేగిన నేపథ్యంలో రౌత్ ఈ విజ్ఞప్తి చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. శివసేనను 40 మంది ఎమ్మెల్యేలు వీడివెళ్లేందుకు బీజేపీ (BJP) ప్రేరేపించిందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్ (Anotonio Guterres)కు రాసిన లేఖలో రౌత్ పేర్కొన్నారు.
''జూన్ 20న మా శివసేనకు చెందిన 40 మంది ఎమ్మెల్యేల గ్రూప్ బీజేపీ ప్రేరేపించడంతో మమ్మల్ని విడిచి వెళ్లిపోయింది. ఫిరాయిందారులు ఒక్కొక్కరు రూ.50 కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది'' అని సంజయ్ రౌత్ తన లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రలో థాకరే సారథ్యంలోని మహావికాస్ కూటమి ప్రభుత్వాన్ని కుప్పకూల్చేందుకు అన్నిరకాల శక్తియుక్తులను బీజేపీ ఉపయోగించిందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం మహారాష్ట్ర సీఎం పీఠంపై ఉన్న ఏక్‌నాథ్ ఏక్‌నాథ్ షిండే సారథ్యంలో 40 మంది ఎమ్మెల్యేలు తమకు వెన్నుపోటు పొడిచారని, వారితో పాటు ఎంవీఏ ప్రభుత్వానికి మద్దతిచ్చిన మరో 10 మంది ఎమ్మెల్యేలు కూడా తమను వీడి వెళ్లిపోయారని ఐరాస చీఫ్ దృష్టికి సంజయ్ రౌత్ తీసుకువెళ్లారు.
థాకరే అనారోగ్య పరిస్థితిని బీజేపీ, ఎమ్మెల్యేలు అడ్వాంటేజ్‌గా తీసుకున్నారని రౌత్ ఆరోపించారు. ''ఏక్‌నాథ్ షిండే, ఇతరులు ముంబై వదిలి సమీపంలో ఉన్న గుజరాత్‌కు తరలివెళ్లిన ప్రక్రియ జూన్ 20న మొదలైంది. అస్వస్థతతో ఉన్న థాకరే 2021 నవంబర్ 12, 19 తేదీల్లో రెండు కీలకమైన ఆపరేషన్లు చేయించుకున్న సమయంలో ఈ చర్యకు పాల్పడ్డారు. ఆ దృష్ట్యా, జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం పాటిస్తున్న తరహాలోనే జూన్ 20వ తేదీని 'ప్రపంచ విద్రోహుల దినం'గా పాటించాలని నేను కోరుతున్నారు. విద్రోహులను గుర్తు చేసుకునేందుకు ఈ చర్య తప్పనిసరిగా తీసుకోవాలి'' అని రౌత్ ఐరాస సెక్రటరీ జనరల్‌కు రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-06-20T13:23:11+05:30 IST