Manish Sisodia: హైకోర్టులో మనీష్ సిసోడియాకు మళ్లీ నిరాశ
ABN, First Publish Date - 2023-07-03T15:19:04+05:30
లిక్కర్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తనకు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన సిసోడియా పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మరోసారి తిరస్కరించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మరోసారి తిరస్కరించింది. సిసోడియాకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. గతంలోనూ పలుమార్లు సిసోడియా బెయిల్ పిటిషన్‌లను హైకోర్టు తోసిపుచ్చింది. అటు సిసోడియాతో పాటు పలువురి బెయిల్ పిటిషన్‌లను కూడా హైకోర్టు కొట్టివేసింది. ఈ జాబితాలో ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జ్ విజయ్ నాయర్, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త బోయిన్‌పల్లి అభిషేక్, లిక్కర్ కంపెనీ మేనేజర్ బినోయ్ బాబు కూడా ఉన్నారు. వీరి పిటిషన్‌లను కూడా హైకోర్టు తిరస్కరించింది.
ఇది కూడా చదవండి: ఎన్సీపీ సంక్షోభం ఎపిసోడ్‌లో కీలక పరిణామం.. శరద్ పవార్ ఏమన్నారంటే..
కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈ ఏడాది మార్చి 9న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆయన భార్య అస్వస్థతకు గురికాగా ఆస్పత్రిలో చేర్పించారు. ఈ నేపథ్యంలో పలుమార్లు తనకు బెయిల్ ఇవ్వాలని మనీష్ సిసోడియా హైకోర్టులో అప్పీల్ చేశారు. సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రమైనవి కావున బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు న్యాయమూర్తి స్పష్టం చేస్తున్నారు. అయితే ఒకే న్యాయమూర్తి ఐదు సార్లు సిసోడియా బెయిల్‌ను నిరాకరించారని.. ఆయన బీజేపీకి చెందిన వ్యక్తి అని సోషల్ మీడియాలో పలువురు ఆరోపణలు చేస్తున్నారు.
Updated Date - 2023-07-03T16:05:22+05:30 IST