PM Modi Parliament Speech: లోక్‌సభలో మోదీ సెటైర్లు
ABN, First Publish Date - 2023-02-08T16:42:52+05:30
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్‌సభలో సమాధానమిచ్చారు.
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ప్రసంగానికి (Presidents Address) ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చకు (Discussion on Motion of Thanks ) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) లోక్‌సభ(Lok Sabha)లో సమాధానమిచ్చారు. ప్రధాని తన ప్రసంగంలో ప్రతిపక్షాలకు అనేకసార్లు చురకలంటించారు.
రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలకు మార్గదర్శనం చేసిందని మోదీ చెప్పారు. నిన్న సభలో కొందరు నాయకులు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని, అది చూసి కొందరు నాయకులు థ్రిల్ అయ్యారని మోదీ పరోక్షంగా రాహుల్ గాంధీపై సెటైర్ వేశారు. ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని, నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని మోదీ చెప్పారు.
గతంలో తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఇతరులపైన ఆధారపడేదని, నేడు భారతే ఇతర సమస్యలను పరిష్కరిస్తోందన్నారు. నేడు భారత్ జీ20 దేశాలకు నాయకత్వం వహిస్తోందని మోదీ చెప్పారు. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండొచ్చని, తనకైతే గర్వంగా ఉందని ప్రధాని చెప్పారు. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారని ప్రతిపక్ష నేతలను మోదీ ఎద్దేవా చేశారు. కొందరు నిరాశలో మునిగిపోయి దేశ విజయాలను సహించలేకపోతున్నారని మోదీ చెప్పారు. నేడు అనేక దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయని, భారత్ మాత్రం ఐదో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా నిలిచిందన్నారు. భారత్‌లో ద్రవ్యోల్బణం అదుపులో ఉండటం చూసి కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని మోదీ చురకలు వేశారు.
దర్యాప్తు సంస్థలను విపక్షాలన్నీ కలిసి విమర్శలు చేస్తున్నాయని మోదీ సెటైర్ వేశారు. ఈడీ దెబ్బకు ప్రతిపక్షనాయకులంతా ఏకతాటిపైకి వచ్చారన్నారు. ఈడీకి ధన్యవాదాలు చెప్పాల్సిందేనన్నారు.
తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేశానని, ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, అది విపక్షాలకు అందదని ప్రధాని చెప్పారు.
తాను 25 కోట్ల కుటుంబాల సభ్యుడినని మోదీ చెప్పారు. కొందరు ఒకే కుటుంబానికి సేవ చేశారని, తాను 25 కోట్ల కుటుంబాలకు సేవ చేస్తున్నానని మోదీ చెప్పారు.
ఒకప్పుడు రైల్వే అంటే యాక్సిడెంట్లు గుర్తుకొచ్చేవని, నేడు వందే భారత్ రైళ్లు చూసి ప్రజలు గర్వపడుతున్నారని ప్రధాని చెప్పారు. 2004 నుంచి 2014 వరకూ దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని ఆరోపించారు. దేశంలో ఆ పదేళ్లు రక్తపుటేర్లు పారాయన్నారు. భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు.
దేశంలో 70 సంవత్సరాలలో 70 ఎయిర్‌పోర్ట్‌లు నిర్మిస్తే తమ ప్రభుత్వం 9 సంవత్సరాలలో 70 ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించిందని మోదీ చెప్పారు. జలమార్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు.
మరోవైపు మోదీ ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకున్నారు. అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలన్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసింది.
Updated Date - 2023-02-08T17:52:28+05:30 IST