DK Shivakumar: అన్నీ తానై వ్యవహరించిన ట్రబుల్ షూటర్..
ABN, First Publish Date - 2023-07-19T11:46:05+05:30
ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాసనసభ సమావేశాలతో బిజీగా ఉండడంతో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే
బెంగళూరు: ముఖ్యమంత్రి సిద్దరామయ్య శాసనసభ సమావేశాలతో బిజీగా ఉండడంతో ట్రబుల్ షూటర్‌గా పేరొందిన ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) అన్నీ తానై 26 రాజకీయ పార్టీల ప్రముఖుల మధ్య సమన్వయం సాధించి సభను విజయవంతంగా నిర్వహించారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌చాందీ మృతి కారణంగా విపక్ష కూటమి సమావేశం కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. చాందీకి నివాళులు అర్పించేందుకు ప్రతిపక్షనేతలంతా తరలివెళ్లారు. అనంతరమే సమావేశాన్ని ప్రారంభించారు. తొలుత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల, ఇతరపార్టీల ముఖ్యమంత్రులు ప్రసంగించారు. తమ తమ రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితిని వివరించారు. ఎన్డీయేను మట్టి కరిపించేందుకు పలు సూచనలు చేశారు. అన్నింటినీ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, పార్టీ నేత రాహుల్‌గాంధీ నోట్ చేసుకున్నట్టు సమాచారం. విపక్షనేతలందరికీ మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విందును ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలోనూ నేతలంతా పాల్గొని తమ ఐక్యతను మరోమారు చాటుకున్నారు. సమావేశం ఫలప్రదమైందని నేతలంతా మీడియాకు చెప్పడం విశేషం.
ప్రధాని పదవి కోసం ఆశపడడం లేదు: ఖర్గే
ప్రతిపక్షనేతల సమావేశాన్ని ఉద్దేశించి తొలుత ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. ప్రధాని పదవిపై కాంగ్రెస్ ఆశపడ్డం లేదని సంకేతాలు ఇవ్వడం ద్వారా కూటమి విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నం చేశారు. ప్రధాని పదవి విషయంలో ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని ఖర్గే ప్రస్తావించడం వెనుక పక్కా వ్యూహం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. దేశప్రజలను కాపాడేందుకు మోదీని మరోమారు ప్రధాని కాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఓ మెట్టు దిగేందుకు సిద్ధంగా ఉందని ఖర్గే ప్రకటించారు. ఖర్గే ప్రసంగం అనంతరం ప్రతిపక్షనేతలు తమ ప్రసంగాల్లో ఎలాంటి సవాళ్లు అయినా ఎదుర్కొనేందుకు సమైక్యంగా ముందడుగు వేద్దామని శపథం పూనినట్టు తెలుస్తోంది.
అజిత్‌కు షాక్ ఇచ్చిన శరద్‌పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో సొంత పార్టీ తిరుగుబాటుతో షాక్‌కు గురైనప్పటికీ ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ బెంగళూరు సమావేశానికి హాజరు కావడం విశేషం. బెంగళూరు సమావేశానికి హాజరు కావద్దని అజిత్ పవార్ వర్గం తమ బాబాయ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చిన సంగతి విదితమే. అయినా ఏమాత్రం పట్టించుకోని శరద్‌పవార్ బెంగళూరు సమావేశానికి హాజరు కావడమే కాకుండా కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియాగాంధీతో ప్రత్యేకంగా చర్చించారు. మహారాష్ట్ర పరిణామాలపైనే వీరు ప్రధానంగా చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అజిత్‌వైపు వెళ్లిన ఎమ్మెల్యేలంతా మళ్లీ తనగూటికే వస్తారని శరద్‌పవార్ ఆశాభావం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
ఇటాలియన్ ఈట్ ఇండియా కంపెనీ: బీజేపీ ఎద్దేవా
యూపీఏ ఘోరంగా విఫలం కావడంతో ఇటాలియన్ ఈట్ ఇండియా కంపెనీని తెరపైకి తెచ్చారని బీజేపీ ఎద్దేవా చేసింది. పలు కుంభకోణాల్లో పీకల్లోతు కూరుకుని జైలుకెళ్లొచ్చిన, బెయిల్‌పై ఉన్న నేతలంతా బెంగళూరులో చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్‌కుమార్ కటీల్, మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ట్వీట్ చేశారు. యూపీఏ హయాంలో జరిగిన వేలాది కోట్ల రూపాయల కుంభకోణాలను ప్రజలు మరిచిపోలేదన్నారు. చొక్కా మార్చినట్టు పేరును మార్చినంత మాత్రాన ప్రజల మద్దతు లభిస్తుందనడం వారి భ్రమేనని పేర్కొన్నారు.
Updated Date - 2023-07-19T11:46:05+05:30 IST