DK Shivakumar: మెట్రో సొరంగం పనులను పరిశీలించిన డీసీఎం
ABN, First Publish Date - 2023-07-15T11:15:08+05:30
ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) నగరంలో మెట్రో సొరంగ మార్గం నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్(Deputy Chief Minister DK Shivakumar) నగరంలో మెట్రో సొరంగ మార్గం నిర్మాణ పనులను శుక్రవారం పరిశీలించారు. శాసనసభ సమావేశం సోమవారానికి వాయిదా పడిన అనంతరం ఆయన నేరుగా లక్కసంద్ర వద్ద మెట్రోరైలు కోసం నిర్మిస్తున్న సొరంగ నిర్మాణాల వద్దకు వెళ్లారు. అనంతరం ఎంజీ రోడ్డు వద్ద చేపట్టిన మెట్రో సొరంగ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల ప్రగతిపై అధికారులతో చర్చించారు. నిర్ణీత అవధిలో నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడాలని, పనుల నాణ్యతా ప్రమాణాల విషయంలో కట్టుదిట్టమైన నియమాలను పాటించాలని సూచించారు. తదుపరి మీడియాతో మాట్లాడుతూ 20.9 కిలోమీటర్ల మేరకు సొరంగమార్గం నిర్మాణ పనులు పూర్తయినట్లు అధికారులు తనకు తెలిపారన్నారు. మొత్తం 18 స్టేషన్లు రానుయన్నారు. నాలుగు ప్యాకేజీలలో ఈ పథకం అమలవుతోందని చెప్పారు. కొన్ని చోట్ల పనులు పూర్తికాగా మరికొన్ని చోట్ల 70-80 శాతం పనులు పూర్తయ్యాయన్నారు. 2025 మార్చి నాటికి ఈ మెట్రో పనులు పరిపూర్ణం కానున్నాయన్నాని అధికారులు వివరించారని డీసీఎం తెలిపారు. పనులు సకాలంలో పూర్తి కావడం ద్వారా ట్రాఫిక్ సమస్య కొంతమేరకు తగ్గుతుందన్నారు. సొరంగమార్గ నిర్మాణాల సాధకబాధకాలపై ఇంకా అధ్యయనం చేస్తున్నామని వివరించారు. ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలవుతున్నదో పరిశీలిస్తున్నామన్నారు. శాస్త్రీయంగా జరిగే పనులపై ఎవరు విమర్శలు చేసినా పట్టించుకునేది లేదన్నారు. డీసీఎం వెంట బీడీఏ చైర్మన్ రాకేశ్‌సింగ్, బీఎంఆర్‌సీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ అంజుమ్ పర్వేజ్, బీబీఎంపీ కమిషనర్ తుషార్ గిరినాథ్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-07-15T11:15:08+05:30 IST