DK Shivakumar: నిప్పులు చెరిగిన డీకే శివకుమార్.. అసలు విషయం ఏంటంటే..
ABN, First Publish Date - 2023-08-16T11:24:53+05:30
వర్షాభావ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం మేకెదాటు పథకానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు
- ప్లీజ్.. ఆ పథకానికి సహకరించండి..
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం మేకెదాటు పథకానికి సహకరించాలని ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(Deputy Chief Minister and KPCC President DK Shivakumar) విజ్ఞప్తి చేశారు. బెంగళూరు కేపీసీసీ కార్యాయలంలో 77వ స్వాతంత్య్ర దినోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రసంగిస్తూ... మేకెదాటు పథకం పూర్తయితే ఉభయ రాష్ట్రాల నీటి సమస్య పరిష్కార మవుతుందన్నారు. తమిళనాడుకు 10 టీఎంసీల నీరు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే క్లిష్ట సమయంలో రాష్ట్ర రైతుల ప్రయోజనాలను పక్కన పెట్టలేమన్నారు. గత ఏడాది 400 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలైం దన్నారు. మేకెదాటు వంటి పథకాలతో వృథా నీటిని కాపాడుకోగలిగితే అంత కంటే గొప్ప విషయం ఏముంటదని ప్రశ్నించారు. కాగా చరిత్రను వక్రీక రించేందుకు కేంద్రం నిరంతర ప్రయత్నం చేస్తోందని రాజ్యాంగం ప్రమాదంలో పడిందని డీకే విమర్శలు గుప్పించారు. బలిష్ఠమైన, సామరస్య భరిత, అభివృద్ధి దాయక భారత నిర్మాణం కోసం ప్రజలు ‘ఇండియా’కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. రానున్న రోజుల్లో దేశమంతటా కర్ణాటక ఫలితాలే వెలుగు చూడనున్నాయని జోస్యం చెప్పారు. తమది సంక్షేమబాట అని, ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్‌లది సంక్షోభాలు సృష్టించే బాట అని నిప్పులు చెరిగారు. స్వాతంత్య్ర దినోత్సవంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కార్యా ధ్యక్షుడు సలీం అహ్మద్, ఎమ్మెల్సీ గోవిందరాజు, మాజీ ఎమ్మెల్సీ హెచ్‌ఎం రేవణ్ణ, మంత్రి లక్ష్మిహెబ్బాళ్కర్, పెద్దసంఖ్యలో నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-16T11:24:53+05:30 IST