Delhi High Court : ఈడీ.. పరిధిలో ఉండు!
ABN, First Publish Date - 2023-01-27T02:35:53+05:30
(ఈడీ) జోరుకు ఢిల్లీ హైకోర్టు కళ్లెం వేసింది. ఇతర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వచ్చే అంశాలపై ఈడీ సొంతంగా తన ఊహాగానాలతో దర్యాప్తు చేయడం కుదరదని స్పష్టం చేసింది. సంబంధిత దర్యాప్తు ..
మనీలాండరింగ్‌లోకి రాని నేరాలను
సొంతంగా దర్యాప్తు చేయడం కుదరదు
అందుకు వేరే దర్యాప్తు సంస్థలున్నాయి
ఎఫ్‌ఐఆర్‌లో లేని ఆరోపణలపై ఆస్తుల
అటాచ్‌మెంట్ చెల్లదు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ, జనవరి 26: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరుకు ఢిల్లీ హైకోర్టు కళ్లెం వేసింది. ఇతర దర్యాప్తు సంస్థల పరిధిలోకి వచ్చే అంశాలపై ఈడీ సొంతంగా తన ఊహాగానాలతో దర్యాప్తు చేయడం కుదరదని స్పష్టం చేసింది. సంబంధిత దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేశాక అందులో మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) నిబంధనలను ఉల్లంఘించిన ఆధారాలు కనిపిస్తే వాటి ఆధారంగా ఈడీ చర్య తీసుకోవచ్చని చెప్పింది. కేవలం పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్-3 పరిధిలోకి వచ్చే నేరాలపైనే ఈడీ దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. ఏదో భారీ నేరంలో భాగంగా ఫలానా నేరం జరిగిందని అంచనాకు రావడం కుదరదని తేల్చిచెప్పింది. సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో, దాని ఆధారంగా ఈడీ వేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు(ఈసీఐఆర్)లో పేర్కొనని అంశాలతో ఈడీ వేసిన ఒక ఆస్తుల అటాచ్‌మెంట్ పిటిషన్ చెల్లదని కొట్టిపారేసింది. భవిష్యత్తులో దర్యాప్తులో భాగంగా సేకరించబోయే సాక్ష్యాధారాలను ప్రాతిపదికగా చేసుకొని, నేరం జరిగిందని ఊహించడం కుదరదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ గత మంగళవారం ఒక కేసులో 111 పేజీల తీర్పునిచ్చారు. పీఎంఎల్‌ఏ చట్టం సెక్షన్-3 కిందకు రాని నేరాలను ఇతర చట్టాల కింద సంబంధిత దర్యాప్తు సంస్థల అధికారులు మాత్రమే దర్యాప్తు చేయాలని స్పష్టం చేశారు. వాటిని ఈడీ సొంతంగా దర్యాప్తు చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ప్రకాశ్ ఇండస్ర్టీ్‌సకు బొగ్గు గనుల కేటాయింపులపై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయగా, అందులో నల్లధనం చలామణి గురించి ఈడీ ఈసీఐఆర్ దాఖలు చేసింది.
ఈడీ దర్యాప్తు క్రమంలో ఆ సంస్థ ఇతరులకు ప్రిఫరెన్షియల్ షేర్లు కేటాయించిన విషయం బయటకు వచ్చింది. ఇది కూడా బొగ్గు కుంభకోణంలోభాగమంటూ ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపునకు సంబంధించిన ఆస్తులను 2018లో జప్తు చేసింది. నిజానికి బొగ్గు గనుల కేటాయింపును 2014లోనే సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ నేపథ్యంలో 2018 నాటి జప్తు చెల్లదంటూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపు అంశం సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో గానీ, ఈడీ ఈసీఐఆర్‌లో కానీ లేనందున ఈ కొత్త అంశాన్ని తాజాగా ఇతర చట్టాల కింద సంబంధిత దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈడీ తన ఈసీఐఆర్‌లో లేని అంశంపై ఊహాగానాలతో సొంతంగా ఆస్తుల అటాచ్‌మెంట్‌కు వెళ్లజాలదని తేల్చిచెప్పింది. 2022 నాటి విజయ్ మదన్‌లాల్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రాతిపదికగా చేసుకొని ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పునిచ్చింది.
Updated Date - 2023-01-27T02:35:55+05:30 IST