Elections: ముఖ్యమంత్రిపై పోటీకి అభ్యర్ధి ఖరారు.. ఆయన ఎవరో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-03-19T12:44:42+05:30
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతోంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai)ను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహమే పన్నింది. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో లింగాయత సామాజికవర్గం ఎక్కువ శాతం బీజేపీవైపే ఉంది. ఇక హావేరి జిల్లా శిగ్గావ్ నుంచి వరుసగా గెలుపొందుతూ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగి ప్రస్తుతం సీఎంగా కొనసాగుతున్న బసవరాజ్ బొమ్మైపై పోటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధారవాడకు చెందిన వినయ్‌కులకర్ణిని రంగంలోకి దింపడానికి వ్యూహం రచిస్తోంది. లింగాయత సామాజిక వర్గంలోనే పంచమశాలి తెగకు చెందిన వినయ్ కులకర్ణిని శిగ్గావ్‌లో బరిలోకి నిలపాలని భావిస్తోంది. ఇందు కోసం వినయ్ కులకర్ణితో రాష్ట్ర పార్టీ ముఖ్యులు సిద్దరామయ్య, డీకే శివకుమార్(DK Sivakumar) పలుమార్లు చర్చించారు. శిగ్గావ్‌లో వినయ్ కులకర్ణిని పోటీ చేయించడం వెనుక కాంగ్రెస్ భారీ కసరత్తు చేసింది. నియోజకవర్గంలో లింగాయత సామాజికవర్గంలోని పంచమశాలి తెగకు చెందినవారు అత్యధికులు ఉన్నారు. గత మూడేళ్లుగా పంచమశాలి వర్గీయులు 2ఏ రిజర్వేషన్ కల్పించాలని పోరాటాలు చేస్తున్నారు. ప్రభుత్వం రెండుమూడుసార్లు తాత్కాలికంగా తేదీలు ఖరారు చేయడం, బుజ్జగించడం వంటి చర్యలతో పాదయాత్రలు, నిరంతర నిరాహార దీక్షలకు బ్రేక్ వేసింది. ప్రభుత్వంపై పంచమశాలి వర్గీయులు తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు. ఇదే తరుణంలోనే అదే తెగకు చెందిన వినయ్ కులకర్ణిని శిగ్గావ్ నుంచి పోటీ చేయించాలని కాంగ్రెస్ ముఖ్యనేతలు భావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. పైగా ఎన్నికల ప్రచార సమితి అధ్యక్షుడిగా ఉండడంతో ఆయన ప్రముఖ నేతలు పాల్గొనే సభల్లోనూ భాగస్వామ్యం కావాల్సి ఉంటుంది.
Updated Date - 2023-03-19T12:44:42+05:30 IST