Elon Musk : ఆ పని చేయలేకపోయిన ఎలన్ మస్క్... ఫలితంగా ట్విటర్‌పై దావా...
ABN, First Publish Date - 2023-01-01T16:28:00+05:30
అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ కార్యాలయం భవనానికి అద్దె చెల్లించడంలో ఆ కంపెనీ యజమాని ఎలన్
న్యూఢిల్లీ : అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ కార్యాలయం భవనానికి అద్దె చెల్లించడంలో ఆ కంపెనీ యజమాని ఎలన్ మస్క్ (Elon Musk) విఫలమయ్యారు. దీంతో ఆ భవనం యజమాని కొలంబియా రెయిట్ (Columbia Reit) ట్విటర్‌పై దావా వేశారు. ఐదు రోజుల్లో 1,36,250 డాలర్లు చెల్లించాలని కొలంబియా నోటీసు ఇచ్చినప్పటికీ, ఆ సొమ్మును మస్క్ చెల్లించలేదని ఓ వార్తా సంస్థ తెలిపింది.
కొలంబియా రెయిట్ డిసెంబరు 16న ట్విటర్ కంపెనీకి ఓ నోటీసును పంపించినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. హార్ట్‌ఫోర్డ్ బిల్డింగ్‌లోని 30వ అంతస్థులో ఉన్న ట్విటర్ కార్యాలయానికి 1,36,250 డాలర్లు అద్దెను ఐదు రోజుల్లోగా చెల్లించాలని ఈ నోటీసు పేర్కొందని తెలిపింది. ఈ సొమ్మును చెల్లించకపోతే డిఫాల్ట్ అయినట్లేనని తెలిపింది. అయితే ఈ గడువులోగా సొమ్ము చెల్లించడంలో ఎలన్ మస్క్ విఫలమవడంతో కొలంబియా గురువారం శాన్‌ఫ్రాన్సిస్కోలోని స్టేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు.
అంతకుముందు ఓ ప్రముఖ అమెరికన్ పత్రిక వెల్లడించిన వివరాల ప్రకారం, ట్విటర్ ప్రధాన కార్యాలయంతోపాటు ఇతర గ్లోబల్ ఆఫీసులకు అద్దె చెల్లించడంలో మస్క్ విఫలమయ్యారని తెలుస్తోంది.
రెండు చార్టర్డ్ ఫ్లైట్స్‌కు చెల్లించవలసిన 1,97,725 డాలర్లను చెల్లించడానికి ట్విటర్ తిరస్కరించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రైవేట్ జెట్ సర్వీసెస్ గ్రూప్ ఎల్ఎల్‌సీ కూడా ట్విటర్‌పై దావా వేసినట్లు సమాచారం.
ఈ వార్తలపై ట్విటర్ అధికారికంగా స్పందించలేదు.
Updated Date - 2023-01-01T16:28:10+05:30 IST