EPFO : ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త!
ABN, First Publish Date - 2023-03-28T12:14:56+05:30
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం
న్యూఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం 2022-23 సంవత్సరానికి ఉద్యోగుల భవిష్య నిధిపై వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించింది. అంతకుముందు సంవత్సరంలో ఈ వడ్డీ రేటు సంవత్సరానికి 8.10 శాతం అనే విషయం తెలిసిందే. ఈ సంస్థలో దాదాపు ఏడు కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు.
2022 మార్చిలో ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును సంవత్సరానికి 8.10 శాతంగా నిర్ణయించే సరికి ఖాతాదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు దశాబ్దాల్లో ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని మండిపడ్డారు.
మన దేశంలో పింఛను విధానం ఏకరీతిగా లేదు. భవిష్య నిధి మాత్రమే సాంఘిక భద్రతకు అత్యంత ప్రధాన వనరుగా ఉంది. పదవీ విరమణ తర్వాత ఆదాయాన్ని హామీ ఇస్తోంది. ఉద్యోగుల భవిష్య నిధులు మరియు మిసిలేనియస్ ప్రావిజన్స్ యాక్ట్, 1952 ప్రకారం ఉద్యోగుల భవిష్య నిధిలో పొదుపు చేయడం తప్పనిసరి.
ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ఉద్యోగుల బేసిక్ సేలరీలో కనీసం 12 శాతం తప్పనిసరిగా తగ్గించి, భవిష్య నిధిలో పొదుపు చేయాలి. యజమాని మరొక 12 శాతం ఇస్తారు.
కోవిడ్ మహమ్మారి వల్ల ఈపీఎఫ్ఓ ఆదాయం ఒత్తిళ్లకు గురైంది. 2019-20 సంవత్సరానికి చెల్లింపులు ఆలస్యమయ్యాయి. ఈపీఎఫ్ఓ ట్రస్టీల కేంద్ర బోర్డు మార్చి 27, 28 తేదీల్లో సమావేశాలు నిర్వహిస్తోంది. 27న జరిగిన సమావేశంలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ఓ ఖాతాదారులు పొదుపు చేసిన సొమ్ముపై వార్షిక వడ్డీ రేటును 8.15 శాతంగా నిర్ణయించినట్లు ఈ బోర్డు సభ్యుడు ఒకరు చెప్పారని జాతీయ మీడియా తెలిపింది. ఈ సమావేశాల్లో ఈపీఎఫ్ఓ ఆర్థిక పనితీరు, పెట్టుబడులపై వస్తున్న ఆదాయంపై సమీక్ష జరుగుతుంది.
ఈపీఎఫ్ఓ ట్రస్టీల కేంద్ర బోర్డులో కేంద్ర ప్రభుత్వం, యాజమాన్యాలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉంటారు. ఈ బోర్డు తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించవలసి ఉంటుంది.
ఇవి కూడా చదవండి :
Gold and Silver Price : పెరగడమేమో వేలల్లో.. తగ్గితే పైసల్లో..
America : రాహుల్ గాంధీ అనర్హతపై అమెరికా సంచలన వ్యాఖ్యలు
Updated Date - 2023-03-28T12:14:56+05:30 IST