Former CM: రహదారి టెండర్ల అవినీతి కేసు.. సుప్రీంకోర్టులో మాజీ సీఎం కేవియట్
ABN, First Publish Date - 2023-07-21T09:05:15+05:30
రహదారుల టెండర్ల అవినీతి కేసుకు సంబంధించి డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి(DMK leader RS Bharti) దాఖలు చేయనున్న అప్పీలు
చెన్నై, (ఆంధ్రజ్యోతి): రహదారుల టెండర్ల అవినీతి కేసుకు సంబంధించి డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి(DMK leader RS Bharti) దాఖలు చేయనున్న అప్పీలు విచారణకు స్వీకరిస్తే తమ తరఫు వాదనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కే పళనిస్వామి (Former Chief Minister Edappadi Palaniswami) సుప్రీం కోర్టులో గురువారం కెవియట్ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఈపీఎస్ రహదారుల టెండర్లను తన బంధువులకు అప్పగించి రూ.4800 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై అవినీతి నిరోధక విభాగం కేసు నమోదు చేసింది. ఆ కేసు విచారణ సీబీఐకి అప్పగించాలని కోరుతూ డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి దాఖలు చేసిన పిటిషన్ ఇటీవల హైకోర్టు తోసిపుచ్చింది. తొలుత ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ ఈపీఎస్(EPS) సుప్రీం కోర్టు ఆశ్రయించారు. ఆ అవినీతి కేసును మద్రాసు హైకోర్టే విచారణ జరపాలంటూ సుప్రీం కోర్టు సూచించింది. హైకోర్టులో వాద ప్రతివాదనల అనంతరం న్యాయమూర్తి ఎన్ ఆనంద్ వెంకటేష్ డీఎంకే నేత ఆర్‌ఎస్ భారతి పిటిషన్ తోసిపుచ్చారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో అప్పీలు చేయనున్నట్లు ఆర్‌ఎస్ భారతి ప్రకటించారు. దీంతో ఈపీఎస్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో గురువారం కేవియట్ సమర్పించారు. ఆర్‌ఎస్ భారతి అప్పీలు పిటిషన్‌పై విచారణ జరిపితే తమ తరఫు వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని ఈపీఎస్ ఆ కేవియట్‌లో పేర్కొన్నారు.
Updated Date - 2023-07-21T09:05:15+05:30 IST