Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ఆయన ఏడు జన్మలెత్తినా కనకపురను విడదీయలేరు..
ABN, First Publish Date - 2023-10-26T10:47:14+05:30
ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) భవిష్యత్తులో కనకపుర బెంగళూరులో
- డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
- రియల్ ఎస్టేట్ కోసమే: మాజీ మంత్రి అశోక్
- రామనగరలోని అన్ని తాలూకాలు బెంగళూరువే: డీసీఎం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ఉపముఖ్యమంత్రి, కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) భవిష్యత్తులో కనకపుర బెంగళూరులో కలవనుందంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. డీకే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎస్(BJP, JDS) తమదైన శైలిలో విరుచుకుపడ్డాయి. మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) స్పందిస్తూ ఏడు జన్మలెత్తినా రామనగర జిల్లాను విభజించడం అసాధ్యమన్నారు. చిక్కబళ్లాపుర, చామరాజనగర, యాదగిరి, కొప్పళ, గదగ్ వంటి జిల్లాలను చారిత్రాత్మక నేపథ్యం దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేశారని తెలిపారు. 1983కు ముందు కనకపుర, సాతనూరు ఏ స్థితిలో ఉండేవో తెలుసుకోవాలని ఉపముఖ్యమంత్రికి చురకలంటించారు. బీజేపీ నేత, మాజీ మంత్రి ఆర్ అశోక్ స్పందిస్తూ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసమే కనకపుర అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. బెంగళూరు నగరంలోని కోటి జనాభాకే సరిపడా తాగునీరు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించలేకపోతున్నారని, కొత్తగా చేర్చిన గ్రామాల పరిస్థితి త్రిశంకుస్వర్గంలో ఉందని పేర్కొన్నారు. ఇక కనకపురతోపాటు మరిన్ని ప్రాంతాలు బెంగళూరులో చేరిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాల్సిందేనన్నారు.
తమ పార్టీ ఏనాడూ ప్రాంతీయతత్వాన్ని ప్రోత్సహించదన్నారు. అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని అన్నారు. కాగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ బెంగళూరులో బుధవారం మీడియాతో మాట్లాడుతూ రామనగర జిల్లాలోని కనకపుర సహా అన్ని తాలూకాలు ఒకప్పుడు బెంగళూరుకు చెందినవేనన్న కనీస పరిజ్ఞానం కుమారస్వామికి లేదని ఎద్దేవా చేశారు. కుమారస్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేసేముందు తన తండ్రి దేవెగౌడను వివరణ కోరి ఉంటే బాగుండేదన్నారు. బాలగంగాధరనాథస్వామిజీ, శివకుమారస్వామిజీ, బెంగళూరు నగర నిర్మాత కెంపేగౌడ, విధానసౌధ నిర్మాత కెంగల్ హనుమంతయ్య రామనగర జిల్లావారేనని, అయితే వీరంతా బెంగళూరు కేంద్రంగా కొనసాగారన్న సంగతిని గుర్తించాలన్నారు. కనకపుర రైతుల భూములకు మంచి ధర లభించాలని కోరుకోవడం తప్పెలా అవుతుందని ఆయన ఎదురు ప్రశ్న వేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ అంశంపై స్పందిస్తూ కనకపురను బెంగళూరులో కలపాలన్న ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని వ్యాఖ్యానించడం గమనార్హం.
Updated Date - 2023-10-26T10:47:14+05:30 IST