Former CM: మాజీసీఎం సంచలన కామెంట్స్.. ‘కావేరి’ విషయంలో తప్పులమీద తప్పులు చేస్తున్న ప్రభుత్వం
ABN, First Publish Date - 2023-09-20T13:06:37+05:30
కావేరి జలాల విషయంలో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టేసిందని మాజీ ముఖ్యమంత్రి,
- బొమ్మై సలహా వింటే ఇక్కట్లే: డీసీఎం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కావేరి జలాల విషయంలో ప్రభుత్వం తప్పుల మీద తప్పులు చేస్తూ ప్రజలను కష్టాల ఊబిలోకి నెట్టేసిందని మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai) విరుచుకుపడ్డారు. కావేరి జలాల నిర్వహణా ప్రాధికార ఆదేశాల మేరకు తమిళనాడుకు నీటిని విడుదల చేస్తున్నప్పుడు ఇక సుప్రీంకోర్టులో వాదించి ప్రయోజనం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బెంగళూరు ఆర్‌టీ నగర్‌లోని నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనెల 12 తర్వాత తమిళనాడుకు నీరు విడుదల చేయడం సాధ్యం కాదని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉండాల్సిందన్నారు. ఇందుకు భిన్నంగా ప్రాధికార ఆదేశాలను అమలు చేస్తున్నారని వివరించారు. తాను డీకే శివకుమార్(DK Shivakumar)ను ఇరుకునపెట్టేలా వ్యవహరిస్తున్నానంటూ వినిపిస్తున్న ఆరోపణలను ఖండించారు. ఆయనను ఇరుకునపెడితే తనకేంటి ప్రయోజనం, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని పేర్కొన్నారు. ఇకనైనా కావేరి జలాల విషయంలో ప్రభుత్వం రెండు నాలుకల ధోరణి వీడాలని సూచించారు.
ఆయన సలహా వింటే అంతే..
కావేరి జలవివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో తమను ఇరుకునపెట్టేందుకు బొమ్మై సలహాలు ఇస్తున్నారంటూ ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్((DK Shivakumar) విరుచుకుపడ్డారు. బెంగళూరు సదాశివనగర్‌లోని నివాసంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొమ్మై హయాంలో ప్రాధికార ఆదేశాల మేరకు ఎన్నిసార్లు నీటిని విడుదల చేశారన్న సమాచారం తమ వద్ద ఉందన్నారు. కోర్టు బయటే కావేరి జల వివాదం పరిష్కారం కావాలన్న మాజీ ప్రధాని దేవెగౌడ సలహాను ఆయన స్వాగతించారు. కావేరి జలవివాదం ఇప్పటిది కాదని, ఆయా సందర్భాలకు తగినట్టు, న్యాయ ఉల్లంఘనకు తావులేని విధంగా నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారని తెలిపారు. కావేరి జల వివాద విషయంలో వివాదం చేయవద్దని ప్రతిపక్షాలైన బీజేపీ, జేడీఎ్‌సకు డీకే విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2023-09-20T13:06:37+05:30 IST