Atiq Ahmed: కొడుకు అంత్యక్రియలకు వెళ్లలేకపోయిన గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్
ABN, First Publish Date - 2023-04-15T16:37:49+05:30
గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ కుమారుడు అసద్ అహ్మద్ అంత్యక్రియలు కట్టుదిట్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య..
ప్రయాగ్‌రాజ్: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ (Atiq Ahmed) కుమారుడు అసద్ అహ్మద్ (Asad Ahmed) అంత్యక్రియలు కట్టుదిట్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్ల మధ్య శనివారం ఉదయం పూర్తయ్యాయి. కడసారి కొడుకుని చూసుకోవాలని అతిక్ ఆశించినప్పటికీ ఆయన లేకుండానే అంత్యక్రియలు ముగిసాయి. ప్రయాగ్‌రాజ్‌లోని కసారీ మసారీ శ్మశాన వాటికలో గంటసేపు అంత్యక్రియలు జరగగా, అతిక్ బంధువులు, కొందరు స్థానికులను మాత్రమే భద్రతా కారణాల రీత్యా పోలీసులు శ్మశాన వాటికలోకి అనుమతించినట్టు ప్రయాగ్‌రాజ్ జాయింట్ పోలీస్ కమిషనర్ ఆకాష్ కుల్హరి తెలిపారు. దీనికి ముందు అసద్ మేనమామ తన మేనల్లుడి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువచ్చారు.
కాగా, తన కొడుకు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అనుమతించాలని మెజిస్ట్రేట్‌ను అతిక్ శుక్రవారంనాడు కోరారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సెలవురోజు కావడంతో అతిక్ విజ్ఞప్తిని రిమాండ్ మెజిస్ట్రేట్‌కు పంపారు. అయితే, అతిక్ అప్లికేషన్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ముందు శనివారంనాడు సమర్పించడానికి ముందే అసద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సంచలనం సృష్టించిన ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులైన అసద్, గులామ్‌లు గురువారంనాడు పోలీసుల ఎదురుకాల్పుల్లో మరణించారు. దీంతో తన కొడుకు ఎన్‌కౌంటర్‌కు తానే బాధ్యుడినంటూ అతిక్ కన్నీటి పర్యంతమయ్యారు. అతిక్ ఐదుగురు కొడుకుల్లో అసద్ మూడవ వాడు. అతిక్ పెద్దకొడుకు ఉమర్ ప్రస్తుతం లక్నో జైలులో ఉండగా, రెండో కొడుకు అలి వేర్వేరు కేసుల్లో నైని సెంట్రల్ జైలులో ఉన్నాడు. నాలుగో కొడుకు అజాం, చివరి కొడుకు అబాన్ ప్రయాగ్‌రాజ్‌లోని జువనైల్ జైలులో ఉన్నారు.
Updated Date - 2023-04-15T16:37:49+05:30 IST