Yogi Adityanath: ఫేక్ ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని హడలిపోయిన గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్
ABN, First Publish Date - 2023-03-27T22:44:20+05:30
ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్‌ను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ భయం వెంటాడింది.
ప్రయాగ్‌రాజ్: ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్‌ను (Gangster politician Atiq Ahmed) ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Chief Minister Yogi Adityanath) భయం వెంటాడింది. గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి అతీఖ్ అహ్మద్‌ను తీసుకుని 45 మంది పోలీసులతో బయలుదేరిన కాన్వాయ్ 25 గంటల ప్రయాణం తర్వాత యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు(Prayagraj) చేరుకుంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసి నైనీ జైలుకు తరలించారు.
దారిలో ఫేక్ ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని గ్యాంగ్‌స్టర్ హడలిపోయాడు. అతిఖ్ అహ్మద్‌పై వందకు పైగా కేసులున్నాయి. 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజు పాల్ హత్య కేసుతో పాటు (BSP MLA Raju Pal) ఇటీవల జరిగిన మరో ఘటనతోనూ అతీఖ్‌కు సంబంధాలున్నాయి. తన తమ్ముడిని ఓడించాడనే కసితో ఎమ్మెల్యేగా ఎన్నికైన రాజు పాల్‌ను 3 నెలలకే చంపేశాడు. అప్పటికి రాజు పాల్‌కు వివాహమై 9 రోజులు మాత్రమే. నాడు రాజు పాల్ హత్య కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్‌పాల్‌ను కిడ్నాప్ చేసి హతమార్చిన కేసులో అతీఖ్ అతడి సోదరుడు ప్రస్తుతం ప్రయాగ్‌రాజ్ ఎంపీ, ఎమ్మెల్యేల న్యాయస్థానంలో హాజరౌతున్నారు.
గతంలో ఎమ్మెల్యేగా ఐదుసార్లు, సమాజ్‌వాదీ పార్టీ(SP) తరపున ఒకసారి ఎంపీగా కూడా గెలిచిన అతీఖ్‌కు మద్దతుగా ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ప్రకటనలు చేశారు. అతీఖ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు.
అతీఖ్‌ను 1270 కిలోమీటర్లు రోడ్డు మార్గం ద్వారా తరలించే క్రమంలో వాహనం పల్టీ కొట్టచ్చా అని ఓ జాతీయ మీడియా సంస్థ ప్రతినిధులు ప్రశ్నించగా పల్టీ కొట్టొచ్చని, యాక్సిడెంట్ కావొచ్చని సీఎం యోగి వ్యాఖ్యానించడం కలకలం రేపింది.
సరిగ్గా ఇదే ప్రకటన వల్ల రోడ్డు మార్గం గుండా వెళ్లేందుకు అతీఖ్ వణికిపోయాడు. తనను చంపేందుకు కుట్ర పన్నారని కూడా వాహనం ఎక్కే ముందు ఆరోపించాడు. యోగి ప్రకటనతో హడలిపోయిన అతీఖ్ కుటుంబీకులు ఇతర వాహనాల్లో పోలీసుల కాన్వాయ్‌ను అనుసరించారు. 25 గంటల పాటు వారు కూడా రోడ్డు మార్గం గుండా ప్రయాణం చేశారు.
ఉమేశ్ పాల్ కిడ్నాప్ కేసులో అతీఖ్ అహ్మద్‌ను అతడి సోదరుడిని పోలీసులు ప్రయాగ్ రాజ్ న్యాయస్థానంలో ఈ నెల 28న ప్రవేశపెట్టనున్నారు. తనను సురక్షితంగా ప్రయాగ్‌రాజ్ తీసుకురావడాన్ని అతీఖ్ అహ్మద్ నమ్మలేకపోతున్నాడు.
Updated Date - 2023-03-28T18:57:19+05:30 IST