Gaumutra controversy: 'గోమూత్రం' వ్యాఖ్యలపై తగ్గేదే లేదన్న డీఎంకే ఎంపీ
ABN, First Publish Date - 2023-12-05T20:55:51+05:30
హిందీ భాషా రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు అంటూ లోక్‌సభలో మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్‌కుమార్ తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, గతంలోనూ తన పార్లమెంటు ప్రసంగాల్లో ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు.
న్యూఢిల్లీ: హిందీ భాషా రాష్ట్రాలను గోమూత్ర రాష్ట్రాలు (Gaumutra states) అంటూ లోక్‌సభలో మంగళవారంనాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ డీఎన్‌వీ సెంథిల్‌కుమార్ (DNV Senthilkumar) తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని, గతంలోనూ తన పార్లమెంటు ప్రసంగాల్లో ఈ వ్యాఖ్యలు చేశానని అన్నారు.
లోక్‌సభలో జమ్మూకశ్మీర్ బిల్లులపై జరిగిన చర్చలో సెంథిల్‌కుమార్ పాల్గొంటూ, హిందీ భాషా రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలుగా అభివర్ణించారు. ఆ రాష్ట్రాల్లోనే బీజేపీ విజయం సాధిస్తుంటుందని అన్నారు. హిందీ భాషా రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయగా, పార్లమెంటులో చేసే వ్యక్తిగత వ్యాఖ్యలపై తాము మాట్లాడలేమని, తాము గోమాతను గౌరవిస్తామని కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ వ్యాఖ్యానించారు. అయితే, మరో కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. ''అన్ పార్లమెంటరీ పదాలను ఎంపిక చేసుకోవడం దురదృష్టకరం. వెంటనే క్షమాపణ చెప్పి, తన వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలి'' అంటూ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై సెంథిల్‌కుమార్ మీడియాకు వివరణ ఇచ్చారు.
''పార్లమెంటులో నేను కొన్ని వ్యాఖ్యలు చేశాను. ఆ సమయంలో హోమంత్రి, బీజేపీ ఎంపీలు కూడా ఉన్నారు. గతంలో కూడా నేను ఇదే పదాలను పార్లమెంటు ప్రసంగాల్లో వాడాను. అదేమీ వివాదాస్పద ప్రకటన కాదు. ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఇక ముందు ఆ పదం వాడను. బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు వేరే పదాన్ని వాడతాను'' అని ఆయన అన్నారు.
Updated Date - 2023-12-05T21:00:54+05:30 IST