Governor: కనవేమిరా సామీ! గవర్నర్ కోసం..
ABN, First Publish Date - 2023-03-31T08:51:56+05:30
గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) కోసం రాష్ట్రంలోని 9 యూనివర్శిటీలు ఎదురు చూస్తున్నాయి. కనీసం గంట సమయమైనా కేటాయిస్తే
అడయార్(చెన్నై): గవర్నర్ ఆర్‌ఎన్ రవి(Governor RN Ravi) కోసం రాష్ట్రంలోని 9 యూనివర్శిటీలు ఎదురు చూస్తున్నాయి. కనీసం గంట సమయమైనా కేటాయిస్తే విద్యార్థులకు డిగ్రీలు అందజేయవచ్చని నిరీక్షిస్తున్నాయి. ప్రభుత్వం-రాజ్‌భవన్(Government-Raj Bhavan) మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో తమ యూనివర్శిటీల స్నాతకోత్సవం ఎప్పుడు జరుగుతుందో, ఎప్పుడు సర్టిఫికెట్లు అందుతాయోనని విద్యార్థులు కుమిలిపోతున్నారు. రాష్ట్ర గవర్నర్‌గా ఆర్‌ఎన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత గత 2021లో డిసెంబరు నెలలో తిరుచ్చి భారతీదాసన్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవం జరిగింది. ఇందులో గవర్నర్ పాల్గొని సుమారుగా పదివేల మంది విద్యార్థులకు స్నాతకోత్సవ డిగ్రీలు అందజేశారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క విశ్వవిద్యాలయానికి కూడా స్నాతకోత్సవం నిర్వహించలేదు. 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించిన స్నాతకోత్సవ డిగ్రీలు ప్రదానం చేయలేదు. దీంతో ఉన్నత చదువుల్లో చేరాల్సిన దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు పైకోర్సుల్లో చేరలేకపోతున్నారు. మరికొందరు విద్యార్థులు కూడా తమకు లభించిన ఉద్యోగాల్లో కూడా చేరలేక అగచాట్లు పడుతున్నారు. ఈ రెండు విద్యా సంవత్సరాలకు చెందిన విద్యార్థులే దాదాపుగా 2.2 లక్షల మంది ఈ డిగ్రీల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలను నిర్వహించేందుకు ఇటు ఉన్నత విద్యాశాఖ, అటు రాజ్‌భవన్ ఏమాత్రం దృష్టిసారించకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇటీవల తంజావూరు జిల్లా పేరావూరణికి చెందిన జమాల్ మహ్మద్ అనే విద్యార్థి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేయగా, అతని విద్యార్హతకు తగిన ఉపాధి కూడా లభించింది. కానీ, యూనివర్శిటీ తరపున అందజేసే స్నాతకోత్సవ డిగ్రీ లేకపోవడంతో వచ్చిన ఉద్యోగంలో చేరలేక కుమిలిపోతున్నాడు. ఇదేవిధంగా అనేక మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై కొంతమంది యూనివర్శిటీ(University)ల ఉన్నతాధికారులను సంప్రదించగా.. గవర్నర్ అపాయింట్మెంట్ ఖరారు కాగానే స్నాతకోత్సవ తేదీని ఖరారు చేస్తామని వెల్లడించారు. అదేవిధంగా రాజ్‌భవన్ వర్గాలను సంప్రదించగా, మొత్తం 9 యూనివర్శిటీల స్నాతకోత్సవాలను నిర్వహించాల్సి ఉందన్నారు. అన్ని విశ్వవిద్యాలయాల స్నాతకోత్సవాలను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వివరణ ఇచ్చాయి.
Updated Date - 2023-03-31T08:51:56+05:30 IST