Ghulam Nabi Azad: ఇప్పుడున్న ముస్లింలు ఒకప్పుడు హిందువులే.. గులాం నబీ ఆజాద్ వివాదాస్పద వ్యాఖ్యలు
ABN, First Publish Date - 2023-08-17T20:52:03+05:30
ఈమధ్య హిందు-ముస్లింల వివాదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. మతాల మధ్య దూరం తగ్గించాల్సిన ప్రజా సేవకులే ఆ రెండు వర్గాల మధ్య దూరం పెరిగేలా సంచలనాలకు తెరలేపుతున్నారు.
ఈమధ్య హిందు-ముస్లింల వివాదాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా.. మతాల మధ్య దూరం తగ్గించాల్సిన ప్రజా సేవకులే ఆ రెండు వర్గాల మధ్య దూరం పెరిగేలా సంచలనాలకు తెరలేపుతున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం హిందు-ముస్లింల గొడవలకు పునాదులు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, డెమొక్రటిక్ ఆజాద్ పార్టీ చీఫ్ గులాం నబీ ఆజాద్ హిందు-ముస్లింలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు దేశంలోని పౌరులందరూ హిందువులేనని.. ఆ తర్వాత హిందు మతం నుంచి ఇతర మతాల్లోకి మారారాని పేర్కొన్నారు. దేశంలో ఇస్లాం కన్నా హిందు మతమే అత్యంత పురాతనమైనదని వెల్లడించారు.
దొడ జిల్లాలోని ఓ మీటింగ్‌కి హాజరైన ఆజాద్ మాట్లాడుతూ.. ఇస్లాం మతం 15 వందల సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిందని, కానీ హిందు మతం అంతకుముందు నుంచే ఉందని పేర్కొన్నారు. కొందరు ముస్లింలు వలస వచ్చారని, మొఘల్ సైన్యంలో చేరారని, క్రమంగా హిందు మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిపోయే సంఖ్య పెరుగుతూ వచ్చిందని తెలిపారు. ఈ మత మార్పిడి అంతర్గతంగానే తీవ్రస్థాయిలో జరిగిందని వెల్లడించారు. కశ్మీర్ పండింట్‌లు కూడా పెద్దఎత్తున ఇస్లాం మతంలోకి మారారని, అందుకే ఇప్పుడు కశ్మీర్‌లో పండిట్‌ల సంఖ్య తగ్గిపోయిందని అన్నారు. 600 ఏళ్ల క్రితం కశ్మీర్‌లో పండిట్‌లదే ఎక్కువగా ఉండేవారని, కానీ వాళ్లు క్రమంగా ఇస్లాం మతాన్ని స్వీకరించారన్నారు. వీళ్లందరి మూలాలు హిందూ మతంలోనే ఉన్నాయన్నారు.
హిందువులు, ముస్లింలు, రాజ్‌పూత్‌లు, బ్రాహ్మణులు, దళితులు, కశ్మీరీలు, గుజ్జర్‌లు.. ఇలా చెప్పుకోవడానికి పేరుకి వేరువేరుగా ఉన్నా, అందరి మూలాలు మాత్రం ఒక్కటేనని గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. మన పూర్వీకులంతా ఇక్కడే ఉన్నారని, బయటి నుంచి ఎవరూ రాలేదని తెలిపారు. మొదట్లో మొఘల్ ఆర్మీ కేవలం 10-12 మందితో ఇక్కడికి వచ్చిందని.. ఆ తర్వాతే మతమార్పిడి పెద్దఎత్తున జరిగిందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని తాను చాలా సందర్భాల్లో చెప్పానని గుర్తు చేశారు. గతంలో ఒక బీజేపీ నాయకుడు బయటి వ్యక్తుల రాక గురించి ప్రస్తావించినప్పుడు.. ఇక్కుడున్న వారంతా బయటి వ్యక్తులు కాదని తాను స్పష్టం చేశానన్నారు. ఈ విధంగా గులాం నబీ వ్యాఖ్యలు చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కొత్త చర్చకు దారతీస్తోంది.
ఇదిలావుండగా.. తొలుత గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీలో ఐదు దశాబ్దాల పాటు పని చేశారు. ఆ పార్టీ నుంచి ఆయన జమ్మూ కాశ్మీర్ సీఎంగా, కేంద్రమంత్రిగా, ఉభయ సభల్లోఎంపీగా వ్యవహిరించారు. కానీ.. గతేడాది ఆయన గతేడాది కాంగ్రెస్ పార్టీని వీడారు. ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదంటూ మండిపడ్డారు. అనంతరం.. ఆయన సొంతంగా డెమొక్రటిక్ ఆజాద్ పార్టీని స్థాపించారు.
Updated Date - 2023-08-17T20:52:03+05:30 IST