Hardeep Singh Nijjar: హత్యకు ముందు హర్దీప్ సింగ్ నిజ్జర్ భారీ కుట్రలు.. ఇండియాపై దాడులకు ఆదేశం
ABN, First Publish Date - 2023-09-23T16:45:35+05:30
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలోనే.. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి....
ప్రస్తుతం భారత్, కెనడా మధ్య ఉద్రిక్త పరిస్థితులు ముదురుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలోనే.. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. జూన్ 18వ తేదీన అతడు కెనడాలోని సర్రేలో హత్యకు గురవ్వగా.. అతని హత్యలో భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశాడు. అప్పటి నుంచే రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హత్యకు సంబంధించి కెనడాలోని భారత దౌత్యాధికారిని వాళ్లు బహిష్కరించడం.. భారత్ కూడా వాళ్లకు కౌంటర్ ఇస్తూ ఇక్కడున్న కెనడా దౌత్యాధికారిని దేశం విడిచి వెళ్లిపోమ్మని ఆదేశాలివ్వడం జరిగింది.
ఇలా రెండు దేశాల మధ్య వాడీవేడీ వ్యవహారం తరుణంలోనే.. హత్యకు గురైన హర్దీప్‌కి సంబంధించి సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. 1980 నుంచే ఎన్నో నేరాల్లో అతని ప్రమేయం ఉందని, యుక్త వయసులోని స్థానిక గూండాలతో సంబంధాలు కలిగి ఉన్నాడని భారత అధికారుల నివేదికలో తేలింది. 1996లో నకిలీ పాస్‌పోర్ట్‌తో కెనడాకు పారిపోయిన అతను.. ఆయుధాలు & పేలుడు పదార్థాల శిక్షణ కోసం పాకిస్థాన్‌కు వెళ్లినట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. కెనడా గడ్డపై ఆశ్రయం పొందుతున్న సమయంలో.. పంజాబ్‌లో అనేక హత్యలు, దాడులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్టు వెల్లడైంది. పంజాబ్ జలంధర్‌లోని భర్‌సింగ్‌పురా గ్రామానికి చెందిన హర్దీప్.. గుర్నేక్ సింగ్ అలియాస్ నేకా ద్వారా గ్యాంగ్‌స్టర్ వద్ద తన జీవితాన్ని ప్రారంభించాడు. 1980, 90లలో అతను ఖలిస్తాన్ కమాండో ఫోర్స్ (KCF) మిలిటెంట్లతో.. అలాగే 2012 నుండి అతను ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ (KTF) చీఫ్ జగ్తార్ సింగ్ తారాతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడని తెలిసింది.
ఎన్నో ఉగ్రవాద కేసుల్లో హర్దీప్ పేరు బయటపడడంతో.. అతడు 1996లో కెనడాకు పారిపోయాడు. అనంతరం పాకిస్తాన్ కేంద్రంగా ఉన్న KTF చీఫ్ జగ్తార్ సింగ్ తారాతో టచ్‌లోకి వచ్చాడు. 2012 ఏప్రిల్ నెలలో బైసాఖి జాతా సభ్యుని వేషంలో పాకిస్తాన్‌ను సందర్శించి.. అక్కడ కొన్ని రోజుల పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాల శిక్షణ పొందాడు. కెనడాకు తిరిగొచ్చాక.. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాలో నిమగ్నమైన తన సహచరుల ద్వారా తీవ్రవాద కార్యకలాపాల కోసం నిధులు సమకూర్చడం ప్రారంభించాడు. పంజాబ్‌లో ఉగ్రవాద దాడిని అమలు చేయడానికి జగ్తార్ సింగ్ తారతో కలిసి హర్దీప్ పక్కా ప్లాన్ వేశాడు. ఇందుకు అతడు కెనడాలో మన్‌దీప్ సింగ్ ధాలివాల్, సర్బ్‌జిత్ సింగ్, అనుప్వీర్ సింగ్, దర్శన్ సింగ్ అలియాస్ ఫౌజీతో కూడిన ఒక ముఠాను సిద్ధం చేసుకున్నాడు. ఈ ముఠా సభ్యులందరూ బ్రిటిష్ కొలంబియాలో, అలాడే కెనడాలో ఆయుధ శిక్షణ పొందారు.
2014లో హర్యానా సిర్సాలోని డేరా సచ్చా సౌదా హెడ్‌క్వార్టర్స్‌పై ఉగ్రదాడిని అమలు చేయాలని హర్దీప్ ప్లాన్ చేశాడు. అయితే.. కొన్ని కారణాల వల్ల అతడు భారత్‌కి చేరుకోలేకపోయాడు. పంజాబ్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడం కోసం.. పంజాబ్‌కు చెందిన గ్యాంగ్‌స్టర్ అర్ష్‌దీప్ సింగ్ గిల్ అలియాస్ అర్ష్ దాలాతో కలిసి హర్దీప్ పని చేశాడు. 2020లో ‘యాంటీ-పాంథిక్ కార్యకలాపాలు’ ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రీకొడుకులు మనోహర్ లాల్ అరోరా, జతీందర్‌బీర్ సింగ్ అరోరా జంట హత్యలకు అర్ష్‌దీప్‌కి అప్పగించాడు. 2020 నవంబర్ 20న దాడి చేసిన దుండగులు.. మనోహర్ లాల్‌ను అతని నివాసంలో కాల్చి చంపారు. కానీ.. కొడుకు మాత్రం తప్పించుకున్నాడు. అనంతరం 2021లో భర్ సింగ్ పురా గ్రామం (నిజ్జర్ స్వస్థలం) పూజారిని హత్య చేయమని అర్ష్‌దీప్‌ని కోరాడు. నిజ్జర్ ఆదేశాల మేరకు దాడి జరిగింది కానీ.. పూజారి ప్రాణాలతో బయటపడ్డాడు.
ఇలా ఈ విధంగా కెనడాలో హర్దీప్ సింగ్ కెనడాలో ఉంటూ.. తెరవెనుక నుండి పంజాబ్‌లో టెర్రర్ వ్యవస్థను నిర్మించాడని భారత అధికారులు సిద్ధం చేసిన ఆ నివేదిక తెలిపింది. ఇలాంటి ఉగ్రవాదిని కెనడా ప్రభుత్వం తమ దేశ పౌరుడిగా పేర్కొనడం గమనార్హం. నిజ్జర్ హత్యను ట్రూడో భారతదేశంతో ముడిపెట్టగా.. భారత్ దీనిని తీవ్రంగా తిరస్కరించింది. ట్రూడో చేసిన ఆరోపణలు.. దౌత్యవేత్తలను బహిష్కరించడం, టిట్-ఫర్-టాట్ వంటి కదలికల్ని ప్రేరేపించింది. రెండు దేశాల మధ్య అంతర్లీన ఉద్రిక్తతలను, దౌత్య సంక్షోభానికి దారి తీసింది.
Updated Date - 2023-09-23T16:45:35+05:30 IST